తాజాగా మరో 154 పాజిటివ్ కేసులు, 14 మంది మృతి

by vinod kumar |
తాజాగా మరో 154 పాజిటివ్ కేసులు, 14 మంది మృతి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ రాష్ట్రంలో మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఒకవైపు కేసుల సంఖ్య బెంబేలెత్తిస్తుంటే మరోవైపు కరోనా మరణాలు మరింతగా భయపెడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజున 14 మంది కరోనా కారణంగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మృతుల సంఖ్య 135కు చేరుకుంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ అధికారులతో సచివాలయంలో ఆదివారం సాయంత్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్షించనున్నారు.

రాష్ట్రంలో ఆదివారం కొత్తగా నమోదైన 154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,650కి చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 132, రంగారెడ్డిలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రిలో 2, సిద్ధిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో ఒకటి చొప్పున కొత్తగా కేసులు నమోదయ్యాయి. వలస కూలీల్లో కొత్తగా కేసులు నమోదు కాకపోయినా ఇప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారి ద్వారా జిల్లాలకూ వైరస్ పాకింది. యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకూ కరోనా కేసులే లేవనుకుంటే రెండు మూడు రోజులుగా కొత్త కేసులు వస్తున్నాయి. తాజాగా ఆదివారం కూడా రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,771 మంది కరోనా చికిత్సలో ఉండగా 1,742 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు.

కరోనాతో జర్నలిస్టు మృతి

కరోనాకు చికిత్స పొందుతూ ప్రముఖ తెలుగు ఛానెల్‌లో పనిచేస్తున్న హైదరాబాద్ జర్నలిస్టు మనోజ్ ఆదివారం మృతిచెందాడు. మనోజ్‌ కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని, కరోనా కూడా సోకడంతో రక్షించడం కష్టమయిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావ్ తెలిపారు. మ‌నోజ్ కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని హైద‌రాబాద్ యూనియ‌న్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే-టీడ‌బ్ల్యూజేఎఫ్‌) కోరింది. జర్నలిస్టుందరికీ రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు అందించాలని ప్రభుత్వాన్ని యూనియన్ కోరింది.

Advertisement

Next Story

Most Viewed