ధరణి పోర్టల్ @అక్కడ రిజక్ట్.. ఇక్కడ అప్రూవల్!

by Anukaran |   ( Updated:2021-06-10 21:09:59.0  )
darani-portal site
X

ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే! అన్న చందంగా సాగుతున్నాయి ధరణి పోర్టల్​అప్రూవల్స్.. తహసీల్దార్లు రిజెక్ట్​చేసిన ఫైళ్లను కలెక్టర్లు ఓకే చేస్తుండగా.. తహసీల్దార్లు పూర్వాపరాలు పరిశీలించి అప్రూవల్​ చేసిన ఫైళ్లను పెండింగ్‌లో పెడుతుండటం గమనార్హం. పట్టదారు పాసు పుస్తకాల చట్టం‌‌ ప్రకారం పాస్​పుస్తకాలు జారీ చేసే అధికారం తహసీల్దార్లకే ఉన్నది. తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు కలెక్టర్లు నేరుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో రకరకాల కారణాలతో రిజెక్ట్​ చేసిన ఫైళ్లన్నీ ఓకే అయిపోతున్నాయి. అదీ తిరస్కరించిన తహసీల్దార్​డిజిటల్​సంతకంతోనే! కలెక్టర్లు.. తమ సంతకాలతో అప్రూవల్​చేసిన ఫైళ్ల విషయంలో ఏమైనా చట్టపరమైన సమస్యలు వస్తే తాము ఇరుక్కుంటామని తహసీల్దార్లు వాపోతున్నారు. ఒకరి సంతకాలు ఇంకొకరు చేయడం ఫోర్జరీ కిందకే వస్తుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు సరైన దిశానిర్దేశం లేకుండా నాలుగు రోజుల్లో పరిష్కారం చూపాలన్న ప్రభుత్వ ఆదేశాలు అధికారులకు గుదిబండగా మారాయి. ఏండ్లుగా తేలని చిక్కులు రోజులు, గంటల వ్యవధిలో పరిష్కరించడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు కలెక్టర్లేమో తహసీల్దార్లు తిరస్కరించిన ఫైళ్లను కూడా అప్రూవల్​ చేస్తున్నారు. ఈ అంశంపై బుధవారం ‘దిశ’లో ‘తహసీల్దార్ల సంతకాలు కలెక్టర్ల చేతిలో’ అన్న శీర్షికతో వచ్చిన కథనం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్ల సంతకాలు కలెక్టర్లు పెట్టేస్తే ఇక బయోమెట్రిక్​, డిజిటల్​కీ భద్రత ఎంత..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్లు అప్రూవల్​చేసినా దానిపై తహసీల్దార్​ సంతకం రావడంతో భవిష్యత్తులో ఏదైనా కోర్టు చిక్కులు వచ్చినప్పుడు బలయ్యేది తహసీల్దారేనని రెవెన్యూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధరణి పోర్టల్, మాడ్యూల్స్, వాటి అమలుపై ఒక్కసారి కూడా వర్క్​షాప్ నిర్వహించలేదని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. యుద్ధప్రాతిపదికన భూ సమస్యలను పరిష్కరించాలన్న ఆదేశాలతో.. రేయింబవళ్లు కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగులు రిపోర్టులు రాసి కలెక్టరేట్లకు పంపిస్తున్నారు. అక్కడేమో రికమండ్​చేసిన ఫైళ్లకు కూడా మోక్షం లభించడం లేదు. ధరణి పోర్టల్​లో పెండింగ్​ అంశాలను చూసే ఆప్షన్​ కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పనులు కలెక్టర్లతోనే చేయించాలన్న ఆలోచన ఉన్నతాధికారులదేనని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపించారు. కొందరు ఈ అంశంపై పని చేసినంత కాలం రెవెన్యూ వ్యవస్థను ఎవరూ బాగు చేయలేరన్నారు. వాస్తవానికి రెవెన్యూ మీద అక్షరం పట్టు లేకపోయినా, మొత్తం తనకే తెలుసునని, పాలకులకు చెప్పుకుంటూ ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు.

కలెక్టర్​అప్రూవల్స్​పై పేచీ..

తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం‌‌-2020 ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాల జారీ అధికారం తహసీల్దార్లకే ఉంది. ఇప్పుడేమో తహసీల్దార్లు తిరస్కరించిన ఫైళ్లను కూడా కలెక్టర్ నేరుగా అప్రూవల్​ చేస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు కలెక్టర్ బయోమెట్రిక్​తో పరిష్కరిస్తే తహసీల్దార్ల సంతకాలే వస్తున్నాయి. ఎవరు ఫైనల్​చేస్తే వారి సంతకంతో కూడిన పత్రాలు, పాసు పుస్తకాలు రావడం సమంజసం. కానీ, ఇక్కడేమో తహసీల్దార్​డిజిటల్ ​సంతకం వచ్చేటట్లుగా ధరణి పోర్టల్​ను రూపొందించారు. దీనిపై కొందరు తహసీల్దార్లు వ్యంగ్యంగా దిస్​ ‘ఈజ్​ ద బ్యూటీ ఆఫ్​ ధరణి’ అని అభివర్ణిస్తున్నారు. వేలాదిగా పేరుకుపోయిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించడం కలెక్టర్లకు సాధ్యం కాదు. కేవలం అప్రూవ్​చేసి తహసీల్దార్లకు పంపితే డిజిటల్​సైన్​ చేసేస్తారు. ఏ ఉద్దేశంతో ఆ పని కూడా కలెక్టర్లు చేస్తున్నారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దార్​ బయోమెట్రిక్, డిజిటల్​కీ ఇవ్వకపోయినా వారి సంతకం వచ్చేటట్లుగా చేయడం ధరణి పోర్టల్‌లోని అతి పెద్ద పొరపాటుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకేమైనా చేయడానికి ఆస్కారం లేదని ఉన్నతాధికారులేమైనా గ్యారంటీ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

తిరస్కరించినా ​ఆమోదమా..?

పెండింగ్ మ్యుటేషన్ విషయంలో ఓ తహసీల్దార్​ చెక్​లిస్టులో “not recommended as the seller is not the pattadar” రిమార్కుతో పంపారు. కానీ అది అప్రూవ్​అయ్యింది. అదే విషయమై కలెక్టరేట్లోని ధరణి కోఆర్డినేటర్ ని ప్రశ్నిస్తే ఓవర్​లుక్‌లో అయ్యిందని సమాధానమిచ్చినట్లు తెలిసింది. అప్రూవల్​ పొందిన వ్యక్తి స్లాట్ బుక్ చేసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. ఇప్పుడు గుర్తించకుండా రిజిస్ట్రేషన్ చేసేస్తే చేతులు మారే ప్రమాదం ఉంటుంది. ఇలాగే కొన్ని జిల్లాల్లో తహసీల్దార్లు రికమండ్ చేసినా కలెక్టర్లు పెండింగులో ఉంచుతున్నారని తెలిసింది. లేదంటే కొన్ని సర్వే నంబర్లు అప్రూవ్​చేయడం, మరికొన్నింటిని పెండింగ్​ పెట్టడమో చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదైన భూములు, రియల్​ఎస్టేట్ ​విస్తృతంగా సాగే ప్రాంతాల్లో తహసీల్దార్లు ఆమోదించిన ఫైళ్లు కూడా కలెక్టరేట్‌లో పెండింగులో ఉంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం దానికి కారణాలేమిటో తెలియక దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. కలెక్టర్లు సమయం ఇవ్వడం లేదని సమాచారం.

నాయకులపై ఒత్తిడి..

బయోమెట్రిక్, డిజిటల్ కీ లేకుండా తమ సంతకాలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు రావడం తహశీల్దార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ట్రెసా నాయకులు ఈ విషయంపై వీలైనంత త్వరగా ప్రభుత్వానికి లేఖ రాయాలని ఒత్తిడి చేస్తున్నారు.

తహసీల్దార్ల అభ్యంతరాలు..

– ధరణి పోర్టల్లో కుల సవరణకు దరఖాస్తులు వస్తున్నాయి. ఆమోదం లేకుండానే వాటికి డిజిటల్​ సంతకాలు చేస్తున్నారు. ఇలా 11 రకాల సమస్యలపై వచ్చిన వాటికి కలెక్టర్​ అప్రూవ్​చేస్తే తహశీల్దార్​ సంతకంతో పాసుపుస్తకం వస్తుంది.
– కలెక్టర్​ బయోమెట్రిక్​ద్వారా తహసీల్దార్ల డిజిటల్​ సంతకం రావడమంటే చట్ట వ్యతిరేకమే.
– మా సంతకాలే కలెక్టర్​ బయోమెట్రిక్ ​ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల మీద వస్తున్నట్లు తెలియడం లేదు. వారికి పాసు పుస్తకాలు వచ్చిన విషయం కూడా తమకు తెలియడం లేదు.
– రెండు నెలలుగా తమ సంతకాలు ఫోర్జరీ అవుతున్నాయి. కలెక్టర్లే పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed