ఆ మున్సిపాలిటీలో భూ కబ్జాల పర్వం

by Shyam |
Pocharam Municipality
X

దిశ, ఘట్కేసర్: పోచారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల కబ్జాల పరంపర కొనసాగుతోంది. పెరిగిన రియల్ భూమ్‌తో జాతీయ రహదారి వెంబడి కబ్జాల పర్వం కొనసాగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఈస్ట్ సిటీగా, వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న పోచారం మున్సిపల్ పట్టణం రియల్ భూమ్‌కు అడ్డాగా మారింది. స్థానికులు ఊహించిన దానికంటే భూముల రేట్లు అధికంగా పెరగటంతో రియల్ మాఫియా దృష్టి ప్రభుత్వ స్థలాల పై పడింది. హెచ్ఎండిఏ నిబంధనల మేరకు వదిలిన పార్క్ స్థలాలు, రహదారులు ఇతర అవసరాల మేరకు వదిలిన ఖాళీ స్థలాలు ప్రజల అవసరాలకు వినియోగించాల్సి ఉంది. కానీ ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులు అప్పనంగా కాజేస్తున్నారు. కాపాడాల్సిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. కబ్జాదారులకు వంత పాడుతూ.. చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో భూ కబ్జాదారులు దర్జాగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పట్టణంలో ఉన్న ప్రభుత్వం స్థలాలు అన్ని కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వ పెద్దలకు ఎన్ని ఫిర్యాదులు చేసిన బుట్టదాఖలవుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు.

సర్వే నెంబర్ 14 లో ఇదే తంతు..

పట్టణ పరిధిలోని అన్నోజిగూడ సర్వే నెంబర్ 14 లో ప్రభుత్వ భూమి 2.20ఎకరాలు ఉంది.ఈ భూమిని గతంలో ఎన్నోమార్లు కబ్జాకు గురైంది. దీనిపై స్థానికుల ఫిర్యాదుల మేరకు జిల్లా భూమి కొలతల శాఖ అధికారులు పలుమార్లు సర్వే చేసిన స్థానిక నాయకుల ఒత్తిడితో ఎటు తేల్చకుండానే వెనుదిరిగి పోతున్నారని అధికారుల పనితీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

దర్జాగా రోడ్డు కబ్జా..

పట్టణ పరిధి నారపల్లి 15వ వార్డ్ సర్వే నెంబర్ 52 గణేష్ నగర్‌‌లో కబ్జారాయుళ్లు దర్జాగా కాలనిలో ఉన్న రోడ్డు కబ్జా చేశారు. జాతీయ రహదారికి అనుకోని ఉండటంతో అధిక రేటు వస్తుందని కొందరు స్థానిక నాయకులు దీనిపై కన్నేశారని, అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

కబ్జాలపై.. జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేసిన ఫలితం లేదు..

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోచారం పట్టణ పరిధిలో అన్నోజిగూడ, పోచారం కాలనీ సరిహద్దులో గతంలో పోచారం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 10, 11, 12 లకు సంబంధించిన పట్టాదారులు సరిహద్దున ఉన్న అన్నోజిగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 3/1 లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఈ భూమిలో బోరు వేసి నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ప్రభుత్వ హయాంలో చాలా అక్రమాలు పెరిగాయని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు.

Advertisement

Next Story