ఆ శునకానికి డీఎన్‌ఏ టెస్ట్

by Anukaran |   ( Updated:2020-11-22 09:04:14.0  )
ఆ శునకానికి డీఎన్‌ఏ టెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : కుటుంబ వ్యక్తులు, వారసత్వ చిక్కులు తదితర అంశాలకు చెందిన పలు కేసుల్లో డీఎన్ఏ టెస్ట్ చేయమని కోర్టు సలహా ఇవ్వడం గురించి తెలిసిందే. కానీ కుక్కకు డీఎన్‌ఏ టెస్టు చేసిన సందర్భాన్ని ఎప్పుడైనా చూశారా? అసలు శునకానికి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

మ‌ధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌‌లో నివసించే జర్నలిస్ట్ షాదాబ్ ఖాన్‌కు శునకాలంటే చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే ఓ లాబ్రాడార్ డాగ్‌ను పెంచుకుంటున్నాడు. అయితే ఆ లాబ్రడార్ 2, 3 నెలల క్రితం కనిపించకుండా పోయింది. దాంతో ఆగస్టులో పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. మనుషుల మిస్సింగ్ కేసు ఛేదించడానికి టైమ్ లేదనే పోలీసులు.. ఓ శునకం పోయిందంటే వెతుకుతారా? అలా ఆ కేసు కొనసాగుతోంది. అయితే, ఇటీవలే హోషంగాబాద్‌కు చెందిన ఏబీవీపీ లీడర్ కార్తీక్ శివ‌హ‌రె నివాసంలో అచ్చం తను పెంచుకున్న లాబ్రాడర్‌ను పోలిన కుక్క షాదాబ్‌కు కనిపించింది. దీంతో షాదాబ్ ఆ కుక్క త‌న‌దేన‌ని, దాన్ని తనకు ఇచ్చేయమని కార్తీక్‌ను అడగడంతో అందుకు ఆయన ఒప్పుకోలేదు. తాను ఆ కుక్కను మరొకరి నుంచి కొనుక్కున్నాని షాదాబ్‌కు వివరించాడు. మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అంతే మ్యాటర్ కాస్త పోలీసుల వరకు వెళ్లింది.

షాదాబ్ తాను ఎంతో అపూరూపంగా తన కుక్కను చూసుకున్నానని, దాన్ని 2017లో పాక్‌మ‌ర్హిలో కొన్నాన‌ని పోలీసులకు వివరించాడు. కార్తీక్ దాన్ని ఇటీవల ఇటార్సీలోని బ్రీడ‌ర్ నుంచి కొనుగోలు చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు అసలు ఆ కుక్క ఎవరిదో తెలుసుకోవడానికి దాన్ని కస్టడిలోకి తీసుకున్నారు. ఆ కుక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, దానికి డీఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తున్నారు. డీఎన్‌ఏ రిపోర్టు వచ్చిన తర్వాత షాదాబ్, కార్తీక్‌లు ఆ శునకాన్ని కొన్న చోట, ఆ కుక్క తల్లిదండ్రులతో పోల్చనున్నారు. దీంతో అది ఎవరి కుక్కో తేలిపోతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంతకీ ఆ కుక్క పేరు చెప్పలేదు కదూ.. షాదాబ్ దాన్ని కోకోగా పిలుచుకుంటే, కార్తీక్ దానికి టైగర్ అని పేరు పెట్టుకున్నాడు.

ఇప్పటివరకు మనుషుల వారసత్వాన్ని తేల్చడానికి ‘డీఎన్ఏ టెస్ట్’ చేసేవాళ్లు, ఇప్పుడు కుక్కకు కూడా చేయాల్సి రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. మీమర్స్ తమ క్రియేటివ్ మీమ్స్‌తో తెగ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story