ఎల్.రమణ దారెటు..? గులాబీ గూటికా? కాషాయ దళంలోకా?

by Anukaran |   ( Updated:2021-06-14 00:01:47.0  )
L.RAMANA TDP
X

దిశ, కరీంనగర్/తెలంగాణ బ్యూరో: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారింది. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదుగుదల లేదన్న కారణంగా బైటకు రావాలని ఆలోచిస్తున్నారు. అయతే ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోడానికి తేల్చుకోలేకపోతున్నారు. రెండు పార్టీలతో నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ పార్టీతో వెళ్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుందోననే లెక్కలు వేసుకుంటున్నారు. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడంతో రెండు పార్టీల్లో ఏది బెస్ట్ అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు. గులాబీ గూటికి వెళ్ళడం ఖాయమనే వార్తలు వచ్చినట్లుగానే కాషాయంవైపు కూడా చూస్తున్నట్లు స్థానికంగా ఊహాగానాలు వస్తున్నాయి.

టీఆర్ఎస్‌లో చేరితే వెంటనే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత మంత్రివర్గంలో స్థానం లభిస్తుందన్న విషయం ఇప్పటికే చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ ఎమ్మెల్సీ పోస్టు ఆరేళ్ళు మాత్రమేనని, మంత్రివర్గంలో రెండున్నరేళ్ళు మాత్రమేనని, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో ఏ మేరకు గుర్తింపు, గౌరవం ఉంటుందోననే అనుమానాలను ఆయన అనుయాయులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకన్నా కుమారుడికి రాజకీయ భవిష్యత్తును కల్పించడాన్నే ప్రధానంగా భావిస్తున్న రమణ ఆ అవకాశాలు బీజేపీలో ఉంటాయనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి మంచి ఆఫర్ ఉన్నా బీజేపీవైపు ఆలోచనలు మాత్రం ఆయనను వీడడంలేదని, అందువల్లనే ఏ నిర్ణయం తీసుకోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తున్నది.

నేడు మీడియా సమావేశం

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా సుదీర్ఘకాలం పాటు అధికారానికి దూరంగానే ఉన్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో తనతో కలిసి పనిచేసినవారంతా ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోగా రమణ మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. అలాంటి కొద్దిమంది ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నందున రమణతో సంప్రదింపులు జరిపి గులాబీ గూటికి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దశలో రమణ సైతం మొగ్గు చూపినట్లు ఆయన అనుకూలవర్గాలు పేర్కొన్నాయి. కానీ ఆ పార్టీలో ఎంత కాలం గుర్తింపు, సముచిత ప్రాధాన్యం ఉంటుందోననే అనుమానాలను కూడా వారు వ్యక్తం చేశారు.

జగిత్యాలలోని కేడర్‌తో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి అభిప్రాయాలను తీసుకున్న రమణ సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తన నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. అభిప్రాయాలు వ్యక్తం చేసినవారిలో టీఆర్ఎస్‌వైపు వెళ్తే మంచిదని కొంతమంది సూచించారు. దానికన్నా బీజేపీలో చేరడమే ఉత్తమం అని మరికొందరి అభిప్రాయం. ఇక తేల్చుకోవాల్సింది రమణ మాత్రమే.

Advertisement

Next Story

Most Viewed