- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గులతో మొదలై.. ఆనక ముగ్ధులను చేసె..
దిశ, వరంగల్: ఇంటి ముందు సరదాగా వేసిన ముగ్గులే ఆమెను సీరియస్ ఆర్టిస్టుగా మలిచాయి. చిన్నప్పుడు సోదరుడు గీసిన బొమ్మల నుంచి పొందిన స్ఫూర్తే.. తనకు ముగ్గులు వేసే రంగులతో చిత్రాలను గీసే నైపుణ్యాన్ని నేర్పింది. మొదటిసారి కాలనీలోని ముగ్గుల పోటీల్లో తనకు లభించిన ప్రశంసల పరంపర నేటికీ కొనసాగుతుండగా.. ఆ రోజుకున్న ప్రత్యేకతను స్ఫురించేలా తన చిత్రాల్లో ఏదో ఒక సందేశాన్ని ప్రతిబింబించేలా చేయడం ఆమె ప్రత్యేకత. సందర్భాన్ని బట్టి ప్రముఖ ఆలయాల్లోనూ తనతో రంగవల్లులు వేయిస్తారంటే ఆమె ఎంతటి ప్రతిభావంతురాలో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో తన భర్త ఇచ్చిన ప్రోత్సాహమూ కొనియాడదగిందే. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తే తనకు వచ్చిన కళను నలుగురికి నేర్పేందుకు సిద్ధమేనంటున్న జనగామ జిల్లాకు చెందిన కుసుమ గురించి ఆమె మాటల్లోనే..
మిక్కీ మౌస్‌తో స్టార్ట్..
మాది వరంగల్ అర్భన్ జిల్లాలోని హన్మకొండ పట్టణం. చిన్నప్పుడు అందరమ్మాయిల మాదిరిగానే ఇంటి ముందు ముగ్గులు పెట్టేదాన్ని. సంక్రాంతి సందర్భంగా కాలనీల్లో నిర్వహించే రంగవల్లుల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకునేది. ఆ సమయంలో చిన్నన్నయ్య బొమ్మలు వేసేవాడు. అతడిని చూసి నేను ముగ్గుల్లో బొమ్మలు వేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. మొదటిసారి మిక్కీ మౌస్ బొమ్మ వేశాను. చాలా మంది మెచ్చుకున్నారు. అక్కడి నుంచి నా చిత్రకళా ప్రస్థానం మొదలైంది. పెళ్లయిన తర్వాత జనగామకు మారాను. అత్తగారింట్లో ఎన్నో పనులతో బిజీగా ఉన్నప్పటికీ చిత్రకళను మాత్రం వదల్లేదు. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా.. నా భర్త నాగరాజు ప్రోత్సాహంతో ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నాను.
ప్రముఖుల ప్రశంసలు
ఎక్కడ పోటీలు జరిగినా నా భర్త వెంట ఉండి తీసుకెళ్తారు. నేను ఏ పోటీల్లో పాల్గొన్నా.. బహుమతి పొందాల్సిందే. లయన్స్ క్లబ్, యాదాద్రి లోటస్ టెంపుల్, రవీంద్ర భారతిలో నేషనల్ వెజిటేరియన్ సంస్థ నిర్వహించిన పోటీల్లో ప్రశంసలు అందుకున్నాను. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పలు దిన పత్రికలు నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయి బహుమతులు పొందాను. గత శివరాత్రి రోజున హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో వేసిన శివలింగాకృతి చిత్రాన్ని చూసి సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి మెచ్చుకుని సన్మానించారు. అక్టోబర్ 21 పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరువీరుల స్తూపం చిత్రానికి కమిషనర్ ప్రశంసించి అవార్డు అందజేశారు. జనగామ జిల్లా మొదటి కలెక్టర్ దేవసేన, జిల్లా జడ్జి శ్రీదేవి మహిళల గౌరవాన్ని నిలబెట్టావంటూ అభినందించడం ఆనందాన్నిచ్చింది.
నా చిత్రాలు సందేశాత్మకం
నా చిత్రాల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకతను వెల్లడిస్తూ ఇతరులు స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో బొమ్మలు వేస్తాను. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు చెబుతూ చిత్రాలు గీశాను. చాలా మంది స్పందించారు. ఎన్నికల సందర్భంగా ఓటు విలువను తెలియజేస్తూ డబ్బులు తీసుకోకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవాలనే సందేశంతో ఆర్ట్ వేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆ చిత్రాలు చూసిన మిత్రులు, బంధువులు మేము కూడా డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసే నాయకుడికి ఓటేస్తామని చెప్పడం సంతోషానిచ్చింది. దేశంలో సంచలనం రేపిన దిశ ఘటనపై నిందితులకు ఉరిశిక్ష విధించాలని వేసిన చిత్రానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రాన్ని ఏకంగా సీపీ సజ్జనార్‌కు పోస్ట్ చేశాను. ఆయన స్పందించి ప్రశంసించారు. ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లి దగ్గరి వెళ్లిన సందర్భాన్ని వెల్లడిస్తూ వేసిన చిత్రానికి కూడా ప్రశంసలు వచ్చాయి.
చిన్నతనంలో అబ్బిన కళ అలవాటుగా మారడంతో.. ఇలా ఏ రోజుకారోజు కొత్త కొత్త చిత్రాలు వేస్తూనే ఉంటాను. తన వంతుగా సమాజానికి ఈ విధంగానైనా సేవ చేస్తున్నాననే సంతృప్తి ఉంది. నా మిత్రులు, బంధువులు ఆ రోజు ప్రత్యేకతను చెబుతూ బొమ్మలు వేయాలంటూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు.