కుడా పీవో గజ‌దొంగ‌: డీటీసీపీ విద్యాధ‌ర్‌కు బ‌క్క జ‌డ్సన్ ఫిర్యాదు

by Shyam |
jadsan
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ కాక‌తీయ ప‌ట్టణాభివృద్ధి సంస్థలో అక్రమాలకు పాల్పడుతున్న పీవో అజిత్‌రెడ్డికి మునిసిప‌ల్‌, ప‌ట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ అండ‌దండ‌లున్నాయ‌ని కాంగ్రెస్ ఏఐసీసీ నేత బ‌క్క జ‌డ్సన్ ఆరోపించారు. స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా దాదాపు 12 సంవ‌త్సరాలుగా ఒకే పోస్టులో అజిత్‌రెడ్డిని కొన‌సాగించ‌డంపై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. అజిత్‌రెడ్డిపై వెంట‌నే చ‌ర్యలు తీసుకుని పీవో పోస్టు నుంచి త‌ప్పించాల‌ని కోరుతూ శ‌నివారం డైరెక్టర్ టౌన్, కంట్రీ ప్లానింగ్ అధికారి విద్యాధ‌ర్‌కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజమా షాకీర్‌తో క‌లిసి ఫిర్యాదు చేశారు.

అనంత‌రం విలేఖ‌రుల‌తో మాట్లాడారు. ప‌ట్టణాభివృద్ధి సంస్థలో ప్రతిది మంత్రికి తెలియ‌కుండా జ‌ర‌గ‌ద‌ని, ద‌శాబ్దకాలం నుంచి ఒకే పోస్టులో ఒకే అధికారిని ఎలా కొన‌సాగిస్తార‌ని ప్రశ్నించారు. సంస్థ కార్యక‌లాపాల్లో, లే అవుట్ అనుమ‌తుల విష‌యంలోనే అనేక అక్రమాలకు పాల్పడి, గ‌తంలో ఏసీబీ అధికారులకు చిక్కార‌ని ఆరోపించారు. ఏసీబీకి అధికారుల‌కు చిక్కినా.. అదే స్థానంలో అజిత్‌రెడ్డికి పోస్టింగ్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అజిత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ అండ‌దండ‌లున్నాయ‌ని, కుడా చైర్మన్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డి భాగ‌స్వామ్యం ఉంద‌ని ఆరోపించారు.

అజిత్‌రెడ్డిని గంజ‌దొంగ‌గా అభివ‌ర్ణించారు. ప‌ట్టణాభివృద్ధికి పాటుప‌డాల్సిన అధికారి దోచుకోవ‌డంలో ప్రావీణ్యం చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఫిర్యాదు ప్రతులను మంత్రి కేటీఆర్‌కు, మున్సిప‌ల్ అడ్మిస్ట్రేష‌న్ మ‌రియు ప‌ట్టణాభివృద్ధి సంస్థ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ అర‌వింద్‌కుమార్‌కు సైతం మెయిల్‌, ట్విట్టర్ ద్వారా పంపించిన‌ట్లు జ‌డ్సన్ వెల్లడించారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించ‌కుంటే ప‌ట్టణాభివృద్ధి సంస్థ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న‌ల‌కు దిగుతామ‌ని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed