ఆ నియోజక వర్గాలపై కేటీఆర్ ఫోకస్.. ప్రత్యేక సమావేశాలు దాని కోసమేనా ?

by Shyam |   ( Updated:2021-10-18 01:51:02.0  )
ఆ నియోజక వర్గాలపై కేటీఆర్ ఫోకస్.. ప్రత్యేక సమావేశాలు దాని కోసమేనా ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్​ఎస్ పార్టీ గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ టీఆర్​ఎస్​పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ ఆరా తీశారు. టీఆర్​ఎస్​ భవన్‌లో సోమవారం 20 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్​ఎస్​ పార్టీపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉన్నది? ఇంకా ఏం చేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చు? అనే అంశాలను తెలియజేయాలని కోరారు.

రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా సూచించారు. ఈమేరకు ఎమ్మెల్యేలు ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేయాలన్నారు. తాను కూడా క్షేత్రస్థాయిలో తిరిగేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు. దీంతో పాటు వచ్చే నెల 15న వరంగల్‌లో నిర్వహించే తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలను క్షుణ్ణంగా వివరించేందుకు ప్రతిరోజు 20 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్​ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 20 మంది చొప్పున మొత్తం 400 మందితో విడతలవారీగా సమావేశం నిర్వహిస్తున్నారు. వరంగల్‌‌లో నిర్వహించే విజయ గర్జన సభకు 10 లక్షల మందిని తీసుకురావాలని ఆయా ప్రతినిధులకు సూచించారు.

Advertisement

Next Story