ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కేటీఆర్ ఆగ్రహం

by  |
ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కేటీఆర్ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ హాస్పిటల్స్‌ తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ పేషంట్ల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తోన్న హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు.

కరోనాతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరుతున్న బాధితులకు యాజమాన్యం షాక్ ఇస్తోంది. లక్షల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నా ప్రాణానికి మాత్రం రక్షణ ఇవ్వలేకపోతున్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో పదుల సంఖ్యల్లో వెలుగుచూస్తునే ఉన్నాయి. తాజాగా తనకు జరిగిన అన్యాయం, ఆవేదనపై ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దెబ్బచెర్ల గ్రామానికి చెందిన అన్రెడ్డి రాధేష్ కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న దౌర్జన్యంపై కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. కరోనా పాజిటివ్ అని తేలడంతో రాధేశ్ కుటుంబీకులు మొత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. తన తల్లి, తండ్రి, సోదరుడికి మాత్రం లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేర్పించానని.. లక్షణాలు లేకపోవడంతో తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు మంత్రికి ట్వీట్ చేశాడు.

ఆస్పత్రిలో అడ్మిట్ చేయించిన పాపానికి.. సరైన వైద్యం అందించకుండానే సుమారు రూ. 40 లక్షలు వసూలు చేశారని ఆరోపించాడు. ఇంత చెల్లించిన తన తల్లిదండ్రులు, సోదరుడి ప్రాణాలను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. మిగతా డబ్బులు చెల్లించకుంటే తండ్రి మృతదేహాన్ని అప్పగించమని ప్రైవేట్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగిందని వాపోయాడు. ఈ ట్వీట్ చూసిన మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆస్పత్రుల్లో ఇటువంటి సంఘటనలు జరగడం సిగ్గు చేటన్నారు. వెంటనే సంబంధిత ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు.


Next Story

Most Viewed