ఆయనలా మరెవరూ గుర్తించలేదు: కేటీఆర్

by Sridhar Babu |
ఆయనలా మరెవరూ గుర్తించలేదు: కేటీఆర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతుంటే తెలంగాణలో మాత్రం సహజీవనం చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దూసుకపోతున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, గంగాధర మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. మానవాళి మనుగడకు అంత్యంత కీలకమైన మొక్కల ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ గుర్తించినంతగా మరెవరూ గుర్తించలేదన్నారు. నీళ్లు కొనుక్కుని తాగే రోజులొస్తాయని ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజమవుతాయని ఎవరూ అనుకోలేదని, చెట్లు సంరక్షించకపోతే భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే రోజులు వస్తాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, పుట్టగానే ఊగే ఊయల నుంచి చనిపోయినప్పుడు కాల్చే కట్టె వరకు చెట్లు ఎంతో అవసరమన్నారు. తెలంగాణలోని ఫారెస్టు కవరేజ్ ఏరియాను 33 శాతానికి పెంచాలన్న సంకల్పంతో హరితహారం సాగుతోందని, 180 కోట్లకు పైగా మొక్కలు ఇప్పటి వరకు నాటామన్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, గ్రామాల్లో పెట్టిన మొక్కల్లో 85 శాతం బతకపోతే సర్పంచి పదవి పోయేలా పంచాయితీ రాజ్ చట్టం తీసుకవచ్చామని కేటీఆర్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా హరితహారం లాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయితీకి ట్రాక్టర్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కరీంనగర్ సమీపంలోని ప్రతిమ మెడికల్ కాలేజీలో టెలి మెడిసిన్ విధానం, మొబైల్ మెడికల్ వెహికిల్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్యెల్యేలు సుంకె రవి శంకర్, వొడితెల సతీష్ బాబు, రసమయి బాలకిషన్, కరీంనగర్ కలెక్టర్ శశాంకలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed