ఈసారి శీతాకాల సమావేశాలు లేవు

by Anukaran |   ( Updated:2020-12-15 01:05:05.0  )
ఈసారి శీతాకాల సమావేశాలు లేవు
X

దిశ, వెబ్‌డెస్క్: ఊహించినట్లుగానే ఈసారి కరోనా కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. ఏకంగా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కరోనా కారణంగా వర్షాకాల సమావేశాలను సైతం చాలా పరిమిత స్థాయిలో ఆలస్యంగా నిర్వహించిన లోక్‌సభ స్పీకర్ ఈసారి డిసెంబరు నెలలో జరగాల్సిన శీతాకాల సమావేశాలను పూర్తి రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖల ద్వారా ఈ సమాచారాన్ని సూచనప్రాయంగా తెలియజేశారు.

శీతాకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని డిసెంబరులో జరపాల్సిన సమావేశాలు ఉండకపోవచ్చని, కాస్త ఆలస్యంగా జరగవచ్చని సూచించారు. అయితే అప్పటికి వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా టైమ్ దగ్గర పడే అవకాశం ఉన్నందున ఏకంగా ఆ సమావేశాలను నిర్వహించుకోవడమే ఉత్తమం అని మంత్రి ఆ లేఖల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రతీ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు జనవరిలో గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత ఒకటి రెండు రోజులకు మొదలవుతాయి. జనవరి 31న ఆర్థిక సర్వే, ఫిబ్రవరి 1వ తేదీన రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఈసారి కూడా అదే జరగనుంది. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed