ఎన్నికల వేళ.. రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కొండా సురేఖ

by Anukaran |   ( Updated:2021-09-30 22:22:20.0  )
Revanth Konda Surekha
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​లో ఇంకా క్లారిటీ రావడం లేదు. నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాలేదు. వాస్తవానికి గురువారం కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఇప్పటి వరకు టికెట్​ రేసులో ముందున్న మాజీ మంత్రి కొండా సురేఖ వెనకడుగు వేస్తున్నట్లు స్పష్టమైంది. హుజురాబాద్​ నుంచి పోటీ చేయలేనంటూ పార్టీకి సూచించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ పెట్టిన షరతుల నేపథ్యంలోనే హుజురాబాద్​ బరిలోకి దిగేందుకు కొండా సురేఖ యూ టర్న్​ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం మొదలైంది.

హుజురాబాద్ బై పోల్ కోసం బీజేపీ, టీఆర్​ఎస్​ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ మాత్రం ఇంకా క్యాండెట్ కన్ఫామ్ చేయలేదు. అయితే బరిలో నిలిచేందుకు 19 మంది దరఖాస్తు చేసుకున్నా.. షార్ట్ లిస్టులో మాత్రం కొత్త పేర్లు చేరాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజ నరసింహ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసి అధిష్టానానికి పంపించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం రాత్రి వరకు చర్చించిన టీపీసీసీ నేతలు… అందులో నలుగురి పేర్లతో తుది జాబితా సిద్ధం చేశారు. అయితే అందులో కొండా సురేఖ పేరు లేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డి, రవికుమార్, ప్యాట రమేష్, దళిత సామాజిక వర్గానికి చెందిన సైదులు పేర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఆ చేతులు కాలకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా పార్టీ అధిష్టానం ఆచి తూచి ఆలోచిస్తోంది. అధికార పార్టీ ప్రలోభాలతో ఒకింత భయం పట్టుకున్నట్లే మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటన విషయంలో భయపడుతొందనే చర్చ కూడా సాగుతోంది. అడ్వాన్స్ గా అభ్యర్థిని అనౌన్స్ చేస్తే కొనేస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ అభ్యర్థి అమ్ముడుపోతే పార్టీ పరువు, నాయకత్వం పరువు గంగలో కలుస్తుందనేది కూడా ఒక కారణమంటున్నారు.

నేను పోటీ చేయను

ఇక కొండా సురేఖ మాత్రం పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు. ఎందుకంటే టీపీసీసీ తరుపున ఇప్పటికే సురేఖకు పలు కండీషన్స్​ పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు పరకాల, వరంగల్​ తూర్పు టికెట్​ కూడా ఇస్తామంటేనే హుజురాబాద్​లో పోటీ చేస్తామని కొండా సురేఖ చెప్పడంతో.. దానిపై టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మూడు రోజుల కింద క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఒకే టికెట్​ సాంప్రదాయం ఉంటుందని, హుజురాబాద్​లో పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలున్నా వచ్చే ఎన్నికల వరకు కూడా అక్కడే పోటీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కారణాలతోనే కొండా సురేఖ హుజురాబాద్​ నుంచి పోటీ చేసేందుకు అయిష్టత చూపిస్తోందని పార్టీ నేతల్లో టాక్​. దీనికితోడు కాంగ్రెస్​ పార్టీ పలు పార్టీలతో మద్దతు కూడబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా బయటకు వచ్చింది. పార్టీ తరుఫున అభ్యర్థిని ప్రకటించకపోవడానికి ఇది కూడా కారణమని గాంధీభవన్​ వర్గాలు చెప్పుతున్నాయి.

Advertisement

Next Story