Turkey: 40 గంటలుగా ఎయిర్ పోర్టులోనే.. 250 మందికి ఒకే టాయిలెట్

by Shamantha N |
Turkey: 40 గంటలుగా ఎయిర్ పోర్టులోనే.. 250 మందికి ఒకే టాయిలెట్
X

దిశ, నేషనల్ బ్యూరో: టర్కీ(Turkey)లోని దియార్‌బకిర్ ఎయిర్ పోర్టులో వర్జీస్ అట్లాంటిక్ విమానంలోని(London-Mumbai Flight) 250 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దాదాపు 40 గంటలుగా అక్కడ ఇరుక్కుపోయినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 2న మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీలోని మారుమూల ప్రాంతంలోని దియార్‌బకిర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అయితే ల్యాండ్‌ అయిన తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో దాదాపు 40 గంటలుగా ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎయిర్‌పోర్టులో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఎక్స్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని గంటలు గడుస్తున్నా ఎయిర్‌లైన్‌ ప్రతినిధులెవరూ తమను సంప్రదించలేదని వారిలో ఒకరు పేర్కొన్నారు. అందరికీ సరిపడా ఆహార ప్యాకెట్‌లు ఇక్కడి సిబ్బంది అందించలేకపోతున్నారని వాపోయారు. ఒక్క టాయిలెట్‌ రూమ్‌ మాత్రమే ఉందని, సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పాయింట్లు కూడా లేవని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కనీసం దుప్పట్లు కూడా అందించలేదన్నారు. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బందిపడుతున్నారన్నారు. త్వరగా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటుచేసి.. తమను ముంబైయికి తరలించాలని వేడుకుంటున్నారు.

ఎయిర్ లైన్స్ ఏమందంటే?

కాగా.. ఈ ఘటనపై వర్జిన్ అట్లాంటా స్పందించింది. ‘మా ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మాకు అత్యంత ముఖ్యం. మీ అసౌకర్యానికి మా హృదయ పూర్వక క్షమాపణలు. ఏప్రిల్‌ 4 స్థానిక కాలమానం ప్రకారం 12:00 గంటలకు దియార్‌బకిర్ విమానాశ్రయం నుంచి ముంబయికి VS1358 విమానాన్ని ఏర్పాటుచేస్తాం. ఒకవేళ ఆ విమానానికి అనుమతులు లభించకపోతే ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం. ప్రయాణికులను టర్కీలోని మరొక ఎయిర్‌పోర్టుకు బస్సులో తరలించి.. అక్కడ్నుంచి వారిని మరో విమానంలో ముంబైకి పంపిస్తాం. ఈలోగా ప్రయాణీకులకు టర్కీలో రాత్రిపూట హోటల్ వసతి అందిస్తాం. మేం ఈ సమస్యను పరిష్కారానికి కృషి చేస్తున్నాము. ఏవైనా అప్ డేట్స్ ఉంటే వెంటనే కస్టమర్లకు తెలియజేస్తాం’ అని వర్జిన్‌ అట్లాంటిక్‌ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై అంకారాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.

Next Story

Most Viewed