స‌ర్కార్ దుబారా ఖ‌ర్చు పెరిగిపోయింది: ప్రొఫెస‌ర్ కోదండ‌రాం

by Shyam |   ( Updated:2021-08-24 01:34:02.0  )
స‌ర్కార్ దుబారా ఖ‌ర్చు పెరిగిపోయింది: ప్రొఫెస‌ర్ కోదండ‌రాం
X

దిశ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స‌ర్కార్ విద్య‌, వైద్యం, ఉపాధి క‌ల్పించ‌డంపై నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని, అన్నీ దుబారా ఖ‌ర్చులు చేస్తూ వీటిని విస్మ‌రించింద‌ని తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. టీజేఎస్ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు స‌మ‌ర్పించిన ఆర్థిక వివ‌రాలు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కొట్టి పారేశారు. ఆ నివేదిక పూర్తిగా అంకెల గార‌డీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, నిర్మాణ రంగాలు కుదేల‌య్యాయ‌ని మండిప‌డ్డారు. వ్యవసాయంలో వచ్చే ఆదాయం రైతులకు అందడం లేద‌ని, ద‌ళారుల‌పాల‌వుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తెలంగాణ‌లో రైతులు, వ్యవసాయంపై ఆధారపడేవాళ్లు ఎక్కువ శాతం ఉంటార‌ని, అలాంటిది 98 శాతం మంది రైతులు అప్పులబారిన పడ్డార‌ని ప్రొఫెస‌ర్ కోదండ‌రాం తెలిపారు. ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింద‌న్నారు. ప్రైవేట్ విద్యా వ్యవస్థ, ఆరోగ్య శ్రీ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశార‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఇరిగేషన్ రంగంలో దుబారా ఖ‌ర్చులు చేస్తూ కాంట్రాక్టర్ల ద్వారా పాలకులు ల‌బ్ధి పొందుతున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చినా.. గుప్పెడు మంది కాంట్రాక్టర్లకే చేరింది తప్పా ప్రజలకు చెందలేద‌న్నారు. సంపదంతా హైద‌రాబాద్ చుట్టే కేంద్రీకరణ అయింద‌ని, అయితే ఆ నిధుల‌న్నీ కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల‌పై అంచనాల‌కు మించి బ‌డ్జెట్ ను పెంచేసి కమీషన్లు తీసుకున్నార‌ని ఆరోపించారు.

ఇరిగేషన్ పై పొదుపు పాటిస్తే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యా రంగం, వైద్య రంగంలో ఎందుకు వెనుకబడిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వాస్త‌వ నివేదిక‌ల‌ను దాచిపెట్టి గార‌డీ చేస్తోంద‌ని పేర్కొన్నారు. మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌క‌టించిన ఆర్థిక నివేదిక అసమగ్రంగా ఉంద‌న్నారు. ఆదాయం ఉంటే నిరుద్యోగ సమస్య ఎందుకు పెరిగిందో నివేదికలో చెప్పలేద‌న్నారు. రాష్ట్రం అప్పుల‌పాలైంద‌ని కాగ్ నివేదిక చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల వ్య‌యాన్ని పెంచి మ‌రింత అప్పుల‌పాలు చేసింద‌న్నారు. క‌నీసం విద్యార్థుల చ‌దువుల‌కు అందించే ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా అందించ‌లేద‌న్నారు. రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం జిల్లాల నుంచి అయితే వాటి అభివృద్ధిని ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌న్నారు. తెలంగాణ సర్కార్ వైఫ‌ల్యాల‌న్నీ ఒక్కొక్క‌టిగా బయటపెడతామ‌ని ప్రొఫెస‌ర్ కోదండ‌రాం స్ప‌ష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed