Scrub Typhus :భయపెడుతున్న కొత్త జ్వరం.. ఇప్పటికే 100 మంది బలి

by Shyam |   ( Updated:2021-09-06 04:46:09.0  )
Scrub Typhus :భయపెడుతున్న కొత్త జ్వరం.. ఇప్పటికే 100 మంది బలి
X

దిశ, ఫీచర్స్ : ఉత్తర ప్రదేశ్‌లో మిస్టరీ ఫీవర్ అందర్నీ భయపెడుతోంది. ఈ జ్వరం బారినపడి ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మిస్టరీ జ్వరాన్ని ‘స్క్రబ్ టైఫస్‌’గా పిలుస్తున్నారు. కేసులు ప్రధానంగా ఫిరోజాబాద్, ఆగ్రా, మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్ జిల్లాల్లో నమోదవుతున్నాయి. అయితే అసలు ఈ జ్వరం ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

‘స్క్రబ్ టైఫస్’ అనేది రికెట్‌సియల్(rickettsial) ఇన్‌ఫెక్షన్ కాగా ఇండియా, ఇతర దక్షిణాసియా దేశాల్లో గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇది దోమలు, పేలు, ఈగలు వంటి చిన్న చిన్న కీటకాల నుంచి సంక్రమిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, మూత్రపిండ, శ్వాసకోశ, జీర్ణశయాంతర వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దద్దుర్లు ద్వారా ఇది ప్రారంభమవుతుంది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందిని ఈ వ్యాధి ప్రభావితం చేస్తుండగా, ప్రతి ఏటా 1 మిలియన్ కేసులు నమోదవుతున్నట్లు అంచనా వేసింది.

ఇది ఎలా వ్యాపిస్తుంది?

US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, స్క్రబ్ టైఫస్ వ్యాధి చిగ్గర్స్ (లార్వా పురుగులు) ద్వారా వ్యాపిస్తుంది. దాని వృద్ధి చక్రంలో, పురుగు ఒక్కసారి మాత్రమే వార్మ్-బ్లడెడ్ జంతువుల సీరం మీద ఫీడ్ చేస్తుంది. గ్రోయిన్, ఆక్సిల్లే (చంకలు), జననేంద్రియాలు, మెడపై ఇవి కుడుతుంటాయి. వ్యాధి సోకిన చిగ్గర్లు, మనిషిని కరిచిన 10 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, చలితో మొదలై తల, కండరాల నొప్పులకు దారితీస్తాయి. అనారోగ్యం పెరిగేకొద్దీ, చిగ్గర్ కాటు జరిగిన ప్రదేశంలో నలుపు వర్ణంలో గాయం ఏర్పడుతుంది. CDC ప్రకారం, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల్లో అవయవ వైఫల్యం, రక్తస్రావం సంభవించవచ్చు.

రోగ నిర్ధారణ

స్క్రబ్ టైఫస్ లక్షణాలు అనేక ఇతర వ్యాధుల మాదిరిగానే ఉంటాయి. స్క్రబ్ టైఫస్‌లో బ్యాక్టీరియా ఉనికిని గుర్తించడానికి రక్త పరీక్షలు చేస్తారు. తీవ్రమైన కేసులకు ఆసుపత్రిలో అడ్మిట్ కావడం శ్రేయస్కరం. చాలా సందర్భాల్లో చికిత్స లేకుండా రెండు వారాల తర్వాత లక్షణాలు తగ్గుతాయి. పిల్లవాడిని లేదా పెద్దవారిని ఈ వైరస్ బారిన పడకుండా రక్షించే టీకా లేదు. ఈ వ్యాధి చికిత్స కోసం సాధారణంగా డాక్సీసైక్లిన్ మెడిసిన్‌ను ఉపయోగిస్తారు.

నేషనల్ హెల్త్ పోర్టల్ ప్రకారం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ సాధారణం. జమ్మూ నుంచి నాగాలాండ్ వరకు ఉప హిమాలయ ప్రాంతాల్లో ఇదివరకే కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో కూడా ఇది వ్యాప్తి చెందింది. వర్షాకాలంలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

స్క్రబ్ టైఫస్ నివారణ కొరకు ఇంటి పరిసరాల్లో గడ్డి మొక్కలు లేకుండా చేసి, పరిసరాలన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేతులు, కాళ్ళను కప్పి ఉంచే దుస్తులను ధరించి, దోమ కాటును నివారించడానికి ‘మస్కిటో నెట్’ వాడాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed