చార్జింగ్ కేబుల్‌తో ప్రియుడి హత్య

by Anukaran |   ( Updated:2020-08-12 05:50:07.0  )
చార్జింగ్ కేబుల్‌తో ప్రియుడి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో ఆ వ్యక్తికి కలిగిన ఆకర్షణ అక్రమ సంబంధానికి దారి తీసింది. కానీ, అదే సంబంధం అతడి ప్రాణాన్ని పొట్టనబెట్టుకుంది. మొబైల్‌ చార్జింగ్ కోసం ఉపయోగించే కేబుల్ ఉరి తాడై అతడి ఉసురు తీయడం ఊహాతీతం. విశాఖ జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం హస్తినాపురానికి చెందిన ధర్మరాజు(40) వృత్తిరీత్యా కార్మికుడు. ఓ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఓ భార్య కూతురు ఉన్నారు. అయితే, ధర్మరాజు పని ముగియగానే రోజు సాయంత్రం సారా తాగే అలవాటు ఉంది. నిత్యం సేవించేవాడు. అది కూడా కేవలం దిబ్బపాలెంలోని ఓ మహిళ ఇంటికి వెళ్లే తాగేవాడు.

సారా తాగేందుకు ఆ మహిళ ఇంటికే వెళ్తున్న ధర్మరాజు ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇదే చనువు వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో సదరు మహిళ కూడా భర్తకు తెలియకుండా ధర్మరాజుతో కలిసి కాలక్షేపం చేసేది. తరచూ.. అతడు డ్యూటీ ముగించుకొని వచ్చే సమయానికి కొద్దిగా సారా తీసుకెళ్లి ఇచ్చేది. మండలం సమీపంలోని జీడిమామిడి తోటల్లో వీరిద్దరూ కలుసుకునేవారు. ఇది గమనించిన భర్త కుళ్లయ్య.. భార్య కదలికలపై ఓ నిఘా వేశాడు.

తన భార్య ధర్మరాజుతో వివాహేతరం సంబంధం సాగించడం భర్త కుళ్లయ్య తట్టుకోలేకపోయాడు. నమ్మి వ్యాపారం అప్పగిస్తే మొత్తం అతడికే దార బోస్తోందని.. మరోవైపు తనను మోసం చేస్తోందన్న మాటలు కుళ్లయ్య జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ధర్మరాజును మట్టుబెట్టాలని పథకం వేసుకున్నాడు.

అయితే, ధర్మరాజు రోజులాగే ఆగస్టు 2న కూడా జీడిమామిడి తోటలో ప్రియురాలి కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో ప్రియురాలు కొద్దిగా సారా, డబ్బులు తీసుకొని ధర్మరాజు వద్దకు బయల్దేరింది. ఇది గమనించిన భర్త కుళ్లయ్య ఆమె వెంటనే ఫాలో అయ్యాడు. తన భార్య జీడిమామిడి తోటలోకి వెళ్లడం చూశాడు. వెంటనే తోటలోకి పరుగుతీయగా ధర్మరాజుతో చనువుగా ఉండటం చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు.

నన్నే మోసం చేస్తావా అంటూ.. ఒక్కసారిగా భార్యపై దాడి చేశాడు. విచక్షణ రహితంగా కొట్టడం మొదలెట్టాడు. ఇదే సమయంలో ధర్మరాజు అడ్డుపడడంతో కుళ్లయ్య కోపం ఆపుకోలేకపోయాడు. జేబులోంచి చార్జింగ్ కేబుల్‌ తీసి అతడి మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి భార్యను తన్ని తీసుకెళ్లాడు.

అయితే, గత మూడు రోజులుగా భర్త ఇంటికి రాకపోవడంతో ధర్మరాజు భార్య పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు ధర్మరాజుకు సారా అమ్మే మహిళతో వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆమె భర్త కుళ్లయ్య హత్య చేశాడని నిర్ధారించారు. అనంతరం కుళ్లయ్యను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story