గాయాలే కొంపముంచాయా..?

by Shyam |
గాయాలే కొంపముంచాయా..?
X

– ఓటములు దేనికి సంకేతం..
టీమ్ ఇండియా వరుసగా ఏడు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన జట్టు. కోహ్లీ, రోహిత్ వంటి బ్యాట్స్‌మెన్..బూమ్రా, షమీ వంటి బౌలర్లతో వన్డే, టీ20 మ్యాచ్‌ల్లోనూ బలమైన జట్టుగా ఎదిగింది. అన్నిసానుకూలతలు, ఎంతో ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరింది. కానీ ఏం జరిగింది..? ఎందుకు పేలవ బ్యాటింగ్‌తో టెస్ట్ సిరీస్‌ను పోగొట్టుకుంది.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు విశేషంగా రాణించడంతో చరిత్రలో తొలిసారి న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌ను నెగ్గింది. కానీ వన్డేలకు వచ్చేసరికి భారత జట్టు చతికిల పడింది. న్యూజిలాండ్ లాంటి బౌన్సీ పిచ్‌లపై రోహిత్, ధావన్‌ వంటి సీనియర్ ఓపెనర్లు లేకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. దీనికి తోడు కెప్టెన్ కోహ్లీ వైఫల్యాలు సైతం జట్టును వెన్నాడాయి. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు వైట్ వాష్ చేసింది.

ఇక ప్రపంచ టెస్టు క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమ్ ఇండియాను న్యూజిలాండ్ జట్టు మట్టి కరిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో భారత్ తొలి మ్యాచ్ 10 వికెట్ల తేడాతో చేజార్చుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో బౌలర్లు వికెట్లు తీసినా బ్యాట్స్‌మెన్ మాత్రం పరుగులు తీయడంలో విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో చెత్త షాట్లతో పెవిలియన్ చేరాడు. టెస్ట్ స్పెషలిస్టులైన పుజారా, రహానేలు కూడా తమ బ్యాటింగ్‌తో భారత జట్టును ఆదుకోలేకపోయారు. జట్టు కూర్పు పైనా మాజీలు పెదవి విరుస్తున్నారు. కెరీర్‌లోనే సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను టెస్టులకు ఎంపిక చేయకపోవడం ఎంత అనాలోచిత నిర్ణయమో సెలెక్టర్లకు ఇప్పటికి తెలిసిరావచ్చు.
గాయాల బెడద..
కొంతకాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెనింగ్ జోడీ..రోహిత్, శిఖర్ ధావన్ గాయాలతో వన్డే, టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాది అదే పరిస్థితి. కాగా గాయం నుంచి కోలుకున్న బుమ్రా తన పూర్వపు లెంగ్త్‌ను అందుకోలేకపోయాడు. మొదటి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ..కీలక రెండో టెస్టుకు గాయపడ్డాడు. ముఖ్యంగా గాయాల కారణంగా ప్రధాన ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం.. ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ఎంపికచేయకపోవడం..షాట్ సెలెక్షన్‌లో బ్యాట్స్‌మన్ పొరపాట్లు భారత్ విజయావకాశాలను ప్రభావితం చేశాయి.
వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌కు ఈ ఓటములు కనువిప్పు లాంటివి. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోకుండా జట్టుగా..తప్పులను విశ్లేషించుకోవాల్సిన అవసరమొచ్చింది. ఆటగాళ్లు తమ బాధ్యతలను గుర్తెరగాలి. తర్వాతి సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో విమర్శకుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే టీమ్ ఇండియా విదేశాల్లో ‘పేపర్ టైగర్స్’ అనే మాటలు వినిపించక తప్పదు..!

Advertisement

Next Story

Most Viewed