టీటీడీ, షిర్డీ సంస్థాన్ అధికారుల కీలక భేటీ

by srinivas |
టీటీడీ, షిర్డీ సంస్థాన్ అధికారుల కీలక భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలోని అన్ని ప్రముఖ హిందూ దేవాల‌యాలు త‌మ వెబ్‌సైట్‌లో… మిగిలిన ఆల‌యాల వెబ్‌సైట్ల వివ‌రాల‌ను పొందుప‌రిస్తే న‌కిలీ వెబ్‌సైట్లను నివారించవచ్చని టీటీడీకి షిర్డీ సంస్థాన్ ప్రతిపాదించింది. ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ‌నివారం తిరుమ‌ల అన్నమయ్య భవన్లో షిర్డీ సంస్థాన్ అధికారుల బృందంతో టీటీడీ చైర్మన్, అధికారులు సమావేశమయ్యారు.

కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటూ భక్తులకు దర్శనం క‌ల్పిస్తున్న తీరును షిర్డీ సంస్థాన్ అధికారులు పరిశీలించారు. టీటీడీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన వెంటనే షిర్డీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ప్రపంచంలోనే హిందూ దేవాల‌యాల్లో మొద‌టిస్థానంలో ఉన్న టీటీడీ, దేశంలోని ఇత‌ర ప్రముఖ హిందూ దేవాల‌యాల్లో భ‌క్తులు సౌక‌ర్యవంతంగా దర్శనం చేసుకునే అంశంపై ఆలోచ‌న‌లు పంచుకుంటుంద‌ని చెప్పారు.

షిర్డీ సంస్థాన్ సీఈవో శ్రీ కె.హ‌రిశ్చంద్ర భ‌గాటే మాట్లాడుతూ… తిరుమ‌ల‌లో క్యూలైన్లు, అన్నప్రసాదం, ల‌డ్డూ ప్రసాదం, భద్రత త‌దిత‌ర అంశాల‌ను త‌మ బృందం ప‌రిశీలించింద‌ని చెప్పారు. వాళ్ల సూచనలు షిర్డీ సంస్థాన్‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు. షిర్డీలోనూ గుడికోమాత కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీకి విన్నవించారు.

Advertisement

Next Story

Most Viewed