రోలర్ కోస్టర్ ఎక్కి అరవకూడదు.. కొవిడ్ 19 నిబంధన

by Shyam |
రోలర్ కోస్టర్ ఎక్కి అరవకూడదు.. కొవిడ్ 19 నిబంధన
X

కరోనాతో జీవించాల్సిన కాలంలో దానికి తగ్గట్టుగా ఒక్కొక్కటి మార్చుకునేందుకు మానవాళి ప్రయత్నిస్తోంది. దానికి టెక్నాలజీ సాయంతో పాటు మానసిక నిబద్ధతను, భావాల నిలకడను సంపాదించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జపాన్‌లోని అమ్యూజ్‌మెంట్ పార్కులు కొత్త నిబంధనను తీసుకొచ్చాయి. ఆ నిబంధన వింటే అసలు అక్కడికి వెళ్లేదే అందుకు కదా.. అదెలా సాధ్యం అనిపిస్తుంది. ఇంతకీ ఆ నిబంధన ఏంటో తెలుసా? రోలర్ కోస్టర్ (రంగుల రాట్నం, జెయింట్ వీల్ లాంటివి) ఎక్కినపుడు గట్టిగా అరవకూడదు.

సాధారణంగా వీకెండ్స్‌లో అమ్యూజ్‌మెంట్ పార్కులకు వెళ్లి సేద తీరి, ఎంజాయ్ చేయాలనిపిస్తుంటుంది. అక్కడ ఉండే రోలర్ కోస్టర్ ఎక్కి, దాని రకరకాల విన్యాసాల్లో భాగంగా అది ఒకేసారి పైకి వెళ్లి కిందకు వచ్చినపుడు శరీరంలో ఎడ్రినలిన్ స్థాయి పెరిగి ఒకేసారి గట్టిగా అరుస్తూ ఆస్వాదిస్తుంటారు. అయితే అలా అరిచినపుడు తుంపర్లు పడటం, ఆ తుంపర్ల ద్వారా కొవిడ్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్న కారణంగా, మీరు రోలర్ కోస్టర్ ఎక్కితే ఎక్కండి కానీ అరవకూడదు, అలాగే ఆనందాన్ని బిగబట్టుకుని ఉండాలని జపాన్‌లో పార్కులు నిబంధన విధించాయి. మూడు నెలల లాక్‌డౌన్ తర్వాత తెరుచుకున్న ‘ఫ్యూజీ క్యూ హైల్యాండ్ థీమ్’ పార్కులో ఈ నిబంధన చూసి వచ్చిన వారు షాక్‌కు గురయ్యారు. రెండు కిలోమీటర్ల దూరం ఉండే ఫ్యూజియామా రోలర్ కోస్టర్ మీద ఇలా అరుపులను బిగపట్టుకుని కూర్చోవడం అసాధ్యమని వారు ఫిర్యాదు చేశారు. వారికి సమాధానంగా ఆనందాన్ని బిగబట్టుకుని ఫ్యూజియామా రోలర్ కోస్టర్ రైడ్ పూర్తి చేసిన ఇద్దరు సిబ్బంది వీడియోను పార్క్ వారు చూపించారు. అది చూసి ఫిర్యాదు చేసిన వారంతా కంగు తిన్నారు.

అయితే వచ్చిన వారు ఆహ్లాదం లేకుండా వెనక్కి తిరిగి పోవడాన్ని తగ్గించడానికి ఫ్యుజీ క్యూ యాజమాన్యం ఒక ఉపాయం ఆలోచించింది. రోలర్ కోస్టర్ రైడ్‌ను నవ్వకుండా, సీరియస్‌గా ముఖం పెట్టి పూర్తి చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వారికి ఫ్రీ ఎంట్రీ టికెట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ తెలివైన ఉపాయానికి మంచి స్పందన కూడా వచ్చింది. దీంతో ఒక్కొక్కరుగా రైడ్ పూర్తి చేయడానికి ముఖానికి మాస్కులు తగిలించుకుని రోలర్ కోస్టర్ ఎక్కడానికి ముందుకొస్తున్నారని అక్కడి యాజమాన్యం చెప్పింది. ఏదేమైనా చిన్న చిన్న ఆనందాలను కూడా ఈ కరోనా హరించి వేసిందని చెప్పడానికి ఇదే నిదర్శనం.

Advertisement

Next Story

Most Viewed