- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘అధికారులకు అంతా ఇవ్వలేదు’
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న రెవెన్యూ చట్టాల ద్వారా ఏ అధికారికీ విశేషాధికారాలు ఉండవని, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే మారుమూల ప్రాంతాల్లోని భూముల ధరలు కూడా పెరిగాయి. మారుమూల ప్రాంతంలోనూ ఎకరా రూ.10 లక్షలకు తగ్గకుండా ఉంది. అందుకే భూ వివాదాలు పెరిగాయి. ల్యాండ్ మాఫియాలు చూస్తున్నం. తహసీల్దార్లపై పెట్రోలు పోసి కాల్చేసే స్థాయికి చేరుకున్నాయి. ఆఫీసులకూ పెట్రోలు డబ్బాలు పట్టుకొని వచ్చే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకు పూర్తి పారదర్శకత ఉండేందుకు కొత్త చట్టాలను రూపొందించామన్నారు. సోమవారం శాసనమండలిలో ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల బిల్లు-2020’, ‘తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల పోస్టు రద్దు బిల్లు-2020’లపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. భూమి శిస్తు వసూలుకే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ. ఇప్పుడది లేదు. రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నం. ఇక వీఆర్వోల పోస్టు అక్కరలేదు. అందుకే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రికార్డుల్లో ఎవరి పేరు పడితే వాళ్ల పేర్లు రాస్తూ దుర్మార్గాలకు పాల్పడ్డారని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘హుస్సేన్ సాగర్‌లో 14 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. ఢిల్లీలో రైల్వే స్టేషన్ కూడా చేశారు. అందుకే ఆర్వోఆర్ పరిధిలోని భూములకు గ్రీన్‌కార్డు, వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులన్నింటికీ మెరూన్ రంగు పాసు పుస్తకాలు జారీ చేస్తామని మండలిలో చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా 90 శాతం ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. అందుకే రైతుబంధు పథకం సక్సెస్ అయ్యిందని, రూ.7,290 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. లంచం ఇచ్చే అవసరం లేని పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నం. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లను ఒకేసారి తహసీల్దార్ చేపట్టే విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు.
‘ధరణి’ పోర్టల్ డైనమిక్‌గా ఉంటుందన్నారు. ఎవరైనా, ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ మార్పులు చేయలేరని స్పష్టం చేశారు. చట్టాల ఆధారంగా రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఎవరికైనా ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నారు. దాని ప్రకారమే తహసీల్దార్లను జాయింట్ రిజిస్ట్రార్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. 89 లక్షల మందికి ప్రాపర్టీలు ఉన్నాయి. వారందరికీ మెరూన్ కలర్ పాసు పుస్తకాలను జారీ చేయనున్నట్లు మరోసారి ప్రకటించారు.
రేట్లు నోటిఫై చేస్తాం
రిజిస్ట్రేషన్ విలువలను ఇష్టారాజ్యంగా మార్చే అవకాశం ఉండదు. ప్రభుత్వమే గెజిట్ నోటిఫికేషన్ చేస్తం. రేట్లు డిసైడ్ చేసి నోటిఫై చేస్తం. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ అధికారికి విశేషాధికారాలు ఉండవన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చార్జీలు చెల్లించిన తర్వాతే అపాయింట్‌మెంట్ ఇస్తారు. ఆ తర్వాతే కార్యాలయానికి రావాల్సి ఉంటుందన్నారు. 30 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వెంటనే ధరణిలో అప్‌డేట్ చేసిన కాపీని కూడా పొందొచ్చునన్నారు.
పౌతి చేసుకునేందుకు కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు. బయోమెట్రిక్, ఐరిస్, ఫింగర్ ప్రింట్స్, ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగానే ధరణిలో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. చట్టంలో లేని అంశాలు వస్తే ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తామన్నారు. లంచాల బాధల నుంచి తప్పించాలని చట్టం తెస్తున్నట్లు చెప్పారు. లడాయికోరులు వివాదాలు సృష్టిస్తే సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందేనన్నారు. ఐదంచెల న్యాయస్థానాలు ఉన్నాయని గుర్తు చేశారు. వీఆర్ఏలను కూడా గ్రామాల్లో పెట్టొద్దని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
భూ భారతి ఫెయిల్
కేంద్రం చేపట్టిన భూ భారతి ఫెయిల్ అయ్యింది. నిజామాబాద్ జిల్లాలో సమస్యలు యథాతథంగానే ఉన్నాయి. గుణాత్మక మార్పులను చూపెట్టలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే టోటల్ సర్వే చేపట్టబోతున్నం. ఖర్చుకు వెనుకాడం. టెక్నాలజీ ఉంది. జిల్లాలో ఏజెన్సీకి ఇచ్చే అవకాశం ఉందన్నారు. మొబైల్ యాప్స్‌లోనూ భూములను కొలిచే మార్గాలొచ్చాయన్నారు. కంక్లూజివ్ టైటిల్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మరో ఏడాదిలోనే సర్వే పూర్తవుతుందన్నారు. ధరణి పోర్టల్‌లో అమల్లోకి తీసుకొచ్చే ముందే పబ్లిక్ డొమెయిన్‌లో పెడతాం. ఏవైనా సూచనలొస్తే తీసుకుంటామని ప్రకటించారు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తామన్నారు.
న్యాయపరమైన చిక్కులొస్తే..
న్యాయపరమైన చిక్కులు వస్తే 100 శాతం సమర్థవంతంగా ఎదుర్కొంటామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. సర్వే తర్వాత కూడా సమస్యలొస్తే పరిష్కరించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని ఆలోచిస్తున్నామన్నారు. కలెక్టర్ లేదా ఇతర అధికారి కేంద్రంగా ఉండాలా అనేది యోచిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకర్లతో కూడా ఇప్పటికే మాట్లాడినం. పాసు పుస్తకాల అవసరం లేకుండానే రుణాలు ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆధార్ కార్డు లేని ఎన్ఆర్ఐల భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆధార్ కాకపోతే మరో మార్గంగా వారికి పాసు పుస్తకాల జారీని చేపడుతామని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానిమిచ్చారు.
0.2 శాతమే పెద్ద రైతులు
తెలంగాణలో కేవలం 0.2 శాతం మాత్రమే పెద్ద రైతులు ఉన్నారని, మిగతా వారంతా పదెకరాల లోపున్నవారేనని సీఎం కేసీఆర్ లెక్కలు చెప్పారు. అందుకే అందరికీ రైతుబంధును అమలు చేస్తున్నం. రికార్డుల్లో అనుభవదారు కాలమ్ పెట్టం. కౌలుదారులను పట్టించుకోం. అది మా పాలసీ. మా పార్టీ విధానం. కిరాయి విధానాన్నిరికార్డుల్లోకి ఎక్కించే బాధ్యత ఎక్కడైనా ప్రభుత్వం తీసుకుంటుందా? అని బీజేపీ, కాంగ్రెస్ పక్ష నేతల ప్రశ్నలకు సమాధానమిస్తూ అడిగారు. జమీందార్లు, భూస్వాముల కాలంలో అవసరం మేరకు ఏర్పాటు చేశారు. ఇప్పుడంతా చిన్న, సన్నకారు రైతులేనని పునరుద్ఘాటించారు.
– 2.20 ఎకరాల లోపున్న వారు 39,52,232 మంది
– 2.20 నుంచి 3 ఎకరాల లోపున్న వారు 4,70,759 మంది
– 3 నుంచి 5 ఎకరాల లోపున్న వారు 11,08,193 మంది
– 5 నుంచి 7.20 ఎకరాల లోపున్న వారు 3,49,382 మంది
– 7.20 నుంచి 10 ఎకరాల లోపున్న వారు 1,15,916 మంది
– 25 ఎకరాలకు పైగా ఉన్న వారు 6 వేల మంది.
– మొత్తం పట్టాదార్ల సంఖ్య 60,95,134 మంది.
కేంద్రంపై మండిపాటు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఏడు మండలాలను ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కలిపేశారని, దాని ద్వారా 2 లక్షల చ.కి.మీ. విస్తీర్ణాన్ని కోల్పోయామని సీఎం కేసీఆర్ అన్నారు. దాంతో పాటు 330 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటును కూడా వాళ్లకే అప్పగించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి చర్చ లేకుండానే ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారని విమర్శించారు.
ప్రతిపాదనలకే వీఆర్వోలు పరిమితం – టి.జీవన్ రెడ్డి, మండలి కాంగ్రెస్ పక్షనేత
రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలు ప్రతిపాదనలకే పరిమితం. వాటిని అమలు చేసేది ఆ పై స్థాయి అధికారులే. కానీ అవినీతిపరులుగా ముద్ర వేశారని మండలి కాంగ్రెస్ పక్షనేత టి.జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తహసీల్దార్, ఆర్డీఓ జోక్యం లేకుండా ఏదైనా మార్పు జరుగుతుందా అని ప్రశ్నించారు. ధరణి రాకముందంటే వారి చేతుల్లో ఉండొచ్చు. ఇప్పుడా అధికారం లేదని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ అరుణారెడ్డి, తహసీల్దార్ నాగరాజులు ఏసీబీకి పట్టుబడిన ఉదంతాలను గుర్తు చేశారు. రెవెన్యూ ఉద్యోగులంతా బాగా చేశారని మీరే ప్రశంసించారని, ఆ తర్వాత వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నారంటూ వ్యవస్థను రద్దు చేయడం సమంజసం కాదన్నారు.
భూ సమగ్ర సర్వే చేపట్టాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. దాన్ని కూడా టైటిల్‌తో లింక్ చేయాలని కోరారు. ఇంకా 10 నుంచి 12 లక్షల మందికి పాసు పుస్తకాలే రాలేదన్నారు. పైగా అప్పీలేట్, రివిజన్ పిటిషన్లు వేసేందుకు రెవెన్యూ కోర్టులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16 వేల కేసుల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఆ తర్వాత వచ్చే వివాదాలకు, ఇప్పటికే రిజిస్టర్ కాని కేసుల పరిష్కారానికి మార్గం చూపలేదన్నారు. సొంత ప్రాపర్టీని హక్కుదారుడు ఎవరికైనా ఇవ్వొచ్చు. కానీ మీరేమో వారసుల పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. వీఆర్వోలను ఇతర శాఖల్లోని ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేస్తే నిరుద్యోగ యువతకు నష్టం వాటిల్లుతుందన్నారు.
భూముల చుట్టే ఏసీబీ: ఎన్.రామచందర్ రావు, బీజేపీ ఎమ్మెల్సీ
భూముల చుట్టూ ఏసీబీ కేసులు తిరుగుతున్నాయి. అందుకే చట్టాలు మారాలి. దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం ద్వారా వివాదాలు తలెత్తుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు అన్నారు. అనేక ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. నారాయణపేటలో హంపి స్వామికి చెందిన 5 వేల ఎకరాలు, గురుకుల్ ట్రస్టు భూముల అంశాలను తేల్చాలని కోరారు. ట్రిబ్యునళ్లకు ఎవరు అర్హులో చెప్పాలన్నారు. వీఆర్వోలు లేకపోతే గ్రామ స్థాయిలో ఏదైనా సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలని ప్రశ్నించారు.
ప్రతి ఇంట్లో ఇదే చర్చ: పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న రెవెన్యూ చట్టాలపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కనబడని రాక్షసులు చనిపోయారని భావిస్తున్నట్లు చెప్పారు. 65 శాతం క్రిమినల్ కేసులు, 14 శాతం హత్యలు, 55 శాతం సివిల్ కేసులు భూ సంబంధమేనన్నారు. మానవ ప్రమేయం లేని ధరణితో పారదర్శకత లభిస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అనేకాంశాలను సుదీర్ఘంగా వివరించారు.
ఎస్కే సిన్హా నివేదికలు ఏమయ్యాయి : జాఫ్రీ, ఎంఐఎం ఎమ్మెల్సీ
తెలంగాణ రాగానే భూములపై కమిటీని వేశారు. దానికి చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే సిన్హాను నియమించారు. ఆయన దర్యాప్తు చేసి అనేక రిపోర్టులు ప్రభుత్వానికి సమర్పించారు. అవన్నీ ఏమయ్యాయని ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ ప్రశ్నించారు. ఆయనిచ్చిన రిపోర్టులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీఎం కేసీఆర్‌ను అడిగారు. అయితే సీఎం అలాంటి అన్ని సమస్యలకు సమగ్ర సర్వేనే పరిష్కారమని దాటవేశారు.