కేసీఆర్ మైండ్‌ గేమ్.. తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ పాలి‘ట్రిక్స్’..!

by Anukaran |   ( Updated:2021-07-04 10:55:06.0  )
kcr-ktr 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాలపై కొత్త లొల్లి మొదలైంది. ఒక వ్యూహం ప్రకారం సీఎం కేసీఆర్​ కృష్ణా జలాల్లో 50–50 అంటూ ప్రకటించిన కొత్త ప్రతిపాదన మరింత ఆజ్యం పోయనుంది. ఒక విధంగా రెండు రాష్ట్రాల్లో జల వివాదాలపై పెట్రోల్​పోసినట్లే అవుతోంది. నీళ్ల నిప్పులకు వాటర్​సెంటిమెంట్‌ను జత కలుపుతున్నట్లు స్పష్టమవుతోందని నీటిపారుదల శాఖ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ఒక మైండ్​ గేమ్‌గా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం సీఎం ప్రతిపాదించిన ఫిఫ్టీ–ఫిఫ్టీ షేర్​ అంశం ఇప్పటి వరకు లేకున్నా… శనివారం సమీక్షతో దీన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఒకప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎదుట కుదిరిన ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్నట్లు సీఎం ప్రకటించిన తీరు విమర్శలకు తావిస్తోంది.

ఆరేండ్ల నుంచి 6 పాయింట్ ఎజెండా

రాష్ట్ర విభజన అనంతరం 2015, జూన్​ 18, 19 తేదీల్లో కృష్ణా జలాల వాటా కేటాయింపులను తేల్చారు. దీనిలో రాష్ట్రానికి 299 టీఎంసీల వాటా లభించింది. అయితే ఇందులో ఏవిధంగా వినియోగించుకోవాలన్న దానిపై తెలంగాణకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కృష్ణా నది బేసిన్‌లో మనకు లభించిన వాటా మేరకు మనం ఏ ప్రాజెక్టు నుంచైనా నీటిని పొందడానికి, వినియోగించుకోవడానికి పూర్తి అధికారం వచ్చింది. ఆరేండ్ల కిందట కృష్ణా నది నిర్వహణ బోర్డు అదనపు కార్యదర్శి అమర్జీత్ సింగ్ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సాగునీటి శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు, తెలంగాణ రాష్ట్ర సాగునీటి సలహాదారు విద్యాసాగర్ రావు సమావేశమై కృష్ణా జలాల పంపిణీపై ఒప్పందం చేసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా మొత్తం 811 టీఎంసీల కృష్ణా నికర జలాల్లో మనకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారు. ఇరు రాష్ట్రాలు ఈ ఒప్పందం చేసుకుని పత్రాలు మార్చుకున్నాయి.

అంతేకాకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం డ్యాంను తెలంగాణ వినియోగించుకుంటుండటంతో ఇక్కడి నుంచి చెన్నై నగరానికి తాగునీటి అవసరాల నిమిత్తం సరఫరా చేస్తున్న 5 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సార్బీసీ)కి సరఫరా చేస్తున్న 19 టీఎంసీల నీటికి ఇబ్బంది కలుగకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్ని 6 పాయింట్​ఎజెండాగా తీసుకుని రెండు రాష్ట్రాలు పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటి వరకూ అదే ఫార్ములాతో వాటా వినియోగించుకుంటున్నారు.

తాత్కాలిక సర్దుబాటు అయినా…!

అప్పటికే కృష్ణా జల వివాదాలు ఎక్కువగా ఉండటంతో కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో 2016, సెప్టెంబర్​ 21న తొలి అపెక్స్​ భేటీ కూడా నిర్వహించారు. ఏపీ అప్పటి సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కేటాయింపులను ఒప్పుకున్నారు. వాస్తవానికి కృష్ణా జలాల వాటా తాత్కాలికమేనని ముందుగా ఒప్పందం చేసుకున్నారు. కేవలం ఏడాది కాలమే ఈ వాటా ఉంటుందని చెప్పారు. కానీ 6 పాయింట్​ఎజెండానే అమలు చేసేందుకు ఇద్దరు సీఎంలు ఏడాది తర్వాత జరిగిన అపెక్స్​ కౌన్సిల్‌లో అంగీకారం తెలిపారు. దీంతో అప్పటి నుంచి అదే పద్ధతిలో నీటిని వాడుకుంటున్నారు. తాత్కాలిక సర్దుబాటు కాస్త ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది.

ఫిఫ్టీ… ఫిఫ్టీ… మూడేండ్ల పాటు రచ్చే

ఈ ఒప్పందం జరిగిన నాటి నుంచి కూడా కృష్ణా జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవడం లేదు. ఇదంతా ఒకవైపు ఉంటే… తాజాగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని ఏపీ చేపట్టిన నేపథ్యంలో వివాదాలు రాజుకున్నాయి. దీనిపై రెండు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఏపీ సీఎం కేంద్రానికి లేఖ రాశారు. అక్కడి మంత్రులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ సీఎం కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. శనివారం సమీక్షించారు. ఇదే సమయంలో కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు చెప్పని విధంగా ఫిఫ్టీ–ఫిప్టీ వాటా అంటూ సీఎం ప్రకటించారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఇది మరింత చర్చకు దారి తీసింది.

వాస్తవంగా ఫిఫ్టీ–ఫిఫ్టీ వాటాపై ఇప్పటి వరకు నోరెత్తని సీఎం ఒక్కసారిగా అందుకోవడంలో సెంటిమెంట్​రాజకీయాలే అనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన అంశాల్లో సర్కారు విఫలం కావడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వంటి వాటి నుంచి దృష్టిని మరల్చేందుకే ఈ కొత్త వివాదం సృష్టిస్తున్నారని, దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తారాస్థాయికి చేరుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యూహం ప్రకారం ఇరు రాష్ట్రాల సీఎంలు నీళ్ల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయంగా అనుకూలంగా మల్చుకుంటారంటున్నారు.

వాస్తవానికి ఒక ఒప్పందం ప్రకారం నీటి వాటా ఉంటే… దానిపై అభ్యంతరం చెప్పుతున్న రాష్ట్రం ముందుగా సమాచారం అందించాలి. సదరు రాష్ట్రానికి నోటీసులివ్వాలి. గతంలో చేసుకున్న సర్దుబాటును పాటించమంటూ నోటీసులో చెప్పుకోవాలి. వివాదం జరుగుతున్న సమయంలో అటు బోర్డుకు, ఇటు కేంద్రానికి కూడా సమాచారం పంపించాలి. కానీ సీఎం కేసీఆర్​ మాత్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ప్రకటించారు. ఇప్పుడు అదే 50-50 ప్రకారం వాటా తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఏపీకి కూడా మంట పెట్టినట్లేనని భావిస్తున్నారు. దీనిపై ఏపీలో కూడా వివాదం ఎక్కువవుతుందని, అలాంటి సమయంలో అక్కడా… ఇక్కడా మళ్లీ సెంటిమెంట్‌తో కలిసి వస్తుందనే అభిప్రాయాలు వక్తమవుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలే అంశం కాకపోవడంతో.. వచ్చే మూడేండ్లు ఇదే అంశంపై రెండు రాష్ట్రాల ప్రజలు వివాదాల్లో ఉండనున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇది మైండ్​ గేమ్​..

నీళ్ల వివాదాలు కచ్చితంగా ఒక మైండ్​ గేమ్. ఏడేండ్ల నుంచి లేని వైరం ఒక్కసారిగా ఎందుకు తెస్తున్నారు. కేటాయించిన వాటానే వాడుకోవడం లేదు. ఎందుకంటే సరిపడా ప్రాజెక్టులు కూడా లేవు. సవాళ్లు ఉన్న చోట నిర్లక్ష్యం చేశారు. దక్షిణ తెలంగాణకు చాలా అన్యాయం చేసినట్లు తెలుస్తూనే ఉంది. ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోకుండా ఇప్పుడు మళ్లీ ఫిప్టీ–ఫిఫ్టీ అంటూ ప్రకటించుకోవడం మైండ్​ గేమ్‎గా మారింది. దీంతో సెంటిమెంట్​ రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. ఇప్పటి వరకు 6 పాయింట్​ ఎజెండాను ఎందుకు పాటిస్తున్నారు. ఇప్పుడే ఎందుకు సగం వాటా అడుగుతున్నారు. దొంతల లక్ష్మీనారాయణ, రిటైర్డ్​ ఇంజినీర్​

మళ్లీ చెప్తున్నాం… ఇదంతా సెంటిమెంట్​ కోసమే..

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అన్ని వర్గాల నుంచి నిరసనలు వస్తున్నాయి. ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆర్భాటాలు చేస్తుందని తేలిపోయింది. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగుల వయస్సు పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై నిరసనలు వస్తున్నాయని తెలుసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నాటకమాడుతున్నారు. గతంలో చేసిన ప్రాజెక్టులతోనే దక్షిణ తెలంగాణకు నీళ్లు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. -డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

ఏడేండ్లు ఏం చేశారు..

ఏడేండ్ల నుంచి దక్షిణ తెలంగాణ ఎంత అన్యాయానికి గురి అయిందో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక వైపు ప్రాజెక్టుల పనులు ఉరుకులు పెట్టిస్తున్నారు. కానీ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి మాత్రం రూపాయి ఇవ్వడం లేదు. కనీసం పాత ప్రాజెక్టులకు కొంచెం నిధులిస్తే కూడా పూర్తవుతాయి. కానీ వాటిని పూర్తి చేస్తే ఇప్పుడున్న టీఆర్‌ఎస్‌కు పుట్టగతులుండవ్. ఇప్పుడు ప్రభుత్వ విధానాలన్నీ ఫెయిల్​కావడంతో నీళ్లతో రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు లేని ఫిఫ్టీ–ఫిఫ్టీ షేర్‌ను ఇప్పుడు ఎందుకు అంటున్నారు. అంటే రెండు రాష్ట్రాల్లో దీన్ని వాడుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే. -చల్లా వంశీచంద్​రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి.

Advertisement

Next Story

Most Viewed