కేసీఆర్​ ప్రాణం బీజేపీ చేతిలో ఉంది: పొన్నాల

by Shyam |   ( Updated:2020-12-13 11:44:12.0  )
కేసీఆర్​ ప్రాణం బీజేపీ చేతిలో ఉంది: పొన్నాల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ, టీఆర్​ఎస్​ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ ప్రధాన శత్రువుగా మారిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాంగ్రెస్​ను అణచి వేసేందుకే ఈ పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. గాంధీభవన్​లో ఆదివారం మీడియాతో పొన్నాల మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని, ఢిల్లీలో యుద్ధం చేస్తానన్న కేసీఆర్‌.. ప్రధాని మోడీ కాళ్లపై పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రధానిని కలిసే సమయంలో కేసీఆర్‌ వెంట ఎంపీలు, అధికారులు లేరని తెలిపారు.

ఎప్పుడైనా ఎంపీలు, భజన బృందం వెంట ఉంటుందని, ఇప్పుడు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఇంత ఆగమేఘాల మీద సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారని, కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ఢిల్లీ వెళ్లారనడం నాటకమని, డీపీఆర్ సమర్పించకుండా జాతీయహోదా వస్తుందా అని ప్రశ్నించారు. పునర్విభజన చట్టం హామీలపై మోడీని ఎందుకు నిలదీయడం లేదని, బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed