- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పటివరకూ ‘ఆరోగ్యశ్రీ‘ అమలవుతుండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్‘ని కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ హెల్త్ అథారిటీ‘తో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. ‘ఆయుష్మాన్ భారత్‘ నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంల వైద్య సేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఏక కాలంలో ఆయుష్మాన్ భారత్, ‘ఆరోగ్యశ్రీ‘ పథకాలు రాష్ట్రంలో అమలుకానున్నాయి.
దీర్ఘకాలంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని సుమారు 300కు పైగా కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు అమలుచేస్తున్నాయి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా అమలుచేయాలంటే విధిగా ఎంప్యానెల్‌మెంట్ జాబితాలో చేరాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేస్తున్న ఆస్పత్రులు 13 మాత్రమే ఉన్నాయి. ఇందులో మూడు ‘నాన్-ప్రాఫిట్‘ కేటగిరీలోని ఆస్పత్రులుకాగా మిగిలిన పది ‘ప్రాఫిట్‘ కేటగిరీలోనివి. ఆయుష్మాన్ భారత పథకం కింద ప్రజలు వైద్య చికిత్సలు చేయించుకోవాలంటే ప్రస్తుతానికి వీటిలో మాత్రమే సాధ్యమవుతుంది. మిగిలిన ఆస్పత్రుల్లో ఆ పథకం కింద వైద్య సేవలు పొందడం సాధ్యం కాదు. అనివార్యంగా ఆరోగ్యశ్రీ పథకం కింద మాత్రమే చేరాల్సి ఉంటుంది.
‘ఆయుష్మాన్ భారత్‘లో కరోనా చికిత్స ఫ్రీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో పేదలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సకు భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆయుష్మాన్ భారత్ పథకంలోకి చేర్చినందువల్ల ఉచితంగానే చికిత్స పొందడానికి వీలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చనందువల్ల డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తోంది. కానీ రాష్ట్రంలో కేవలం 13 ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ఎంప్యానెల్‌మెంట్ ఉన్నందున వాటిల్లో మాత్రమే కరోనా ట్రీట్‌మెంట్ ఉచితంగా పొందడం వీలవుతుంది. కానీ ఇందులో ఆరు కంటి ఆస్పత్రులే అయినందువల్ల కరోనా ట్రీట్‌మెంట్ అందుబాటులో లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత, ఆరోగ్యశ్రీ పథకాలను కరోనా ట్రీట్‌మెంట్ కోసం ఏ విధంగా అనుసంధానం చేస్తుందన్నది ఇంకా తేలలేదు.
రాష్ట్రంలో 26 లక్షల మందికి ప్రయోజనం
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందువల్ల సుమారు 26 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. కరోనాతో సంబంధం లేకుండా ఇతర వ్యాధులకు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో గరిష్ఠంగా ఐదు లక్షల రూపాయల వరకు చికిత్స చేయించుకోవచ్చు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు 88 లక్షల కుటుంబాలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకానికి రూపొందించిన అర్హతలు, నియమ నిబంధనలతో ఎక్కువ వ్యాధులకు ఉచిత చికిత్స చేయించుకోవడం వీలవుతున్నా అర్హతకు నిర్దేశించిన ప్రమాణాలు భిన్నంగా ఉన్నందున 26 లక్షల మందికి మాత్రమే ఆ పథకం వర్తించనుంది.
రాష్ట్రానికి సుమారు రూ. 280 కోట్ల మేర ప్రయోజనం
రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గతేడాది డిసెంబరు 30వ తేదీన ప్రకటన చేశారు. సుమారు నాలుగున్నర నెలల తర్వాత దానికి కదలిక వచ్చి నేషనల్ హెల్త్ అథారిటీతో ఒప్పందం కుదిరింది. ఈ పథకం ద్వారా కేంద్రం నుంచి సుమారు రూ. 280 కోట్ల మేర రాష్ట్రానికి రానుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీకి వెచ్చించే ఖర్చు తగ్గనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతీ ఏటా సుమారు రూ. 600 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కోసం ఖర్చవుతోంది. కానీ సమయానికి రీఇంబర్స్‌మెంట్ చేయడం లేదంటూ ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రుల యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి. ప్రతీ ఏటా బకాయిలు పేరుకుపోతున్నట్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అమల్లోకి వస్తున్నందున ఆ మేరకు రాష్ట్రానికి ఆర్థికంగా వెసులుబాటు లభించనుంది.