‘కేసీఆర్.. మీ తెలంగాణ మంత్రులను కంట్రోల్ చేయండి’

by srinivas |   ( Updated:2021-06-28 04:34:49.0  )
ramachandraiah kcr
X

దిశ, ఏపీ బ్యూరో: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలు సరికాదని వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. ఇరు రాష్ట్రాల్లో సంపూర్ణ సాగు ప్రాజెక్టులకు జలయజ్ఞం ద్వారా లక్షల కోట్ల రూపాయల కేటాయించి నిర్మించిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వైఎస్ ఎనలేని కృషి, పోరాటం చేశారని చెప్పుకొచ్చారు.

గతంలో ప్రజా సంకల్ప పాదయాత్ర తెలంగాణలోని చేవెళ్ల నుండే ప్రారంభించారన్న విషయాన్ని ఆ ప్రాంత నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇచ్చంపల్లె, కాళేశ్వరం ప్రాజెక్టును సాకారం చేసింది వైఎస్ఆర్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రాంత నేతలు వైఎస్ఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన మంత్రులు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం సున్నితమైన అంశమని దాన్ని తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. తాము కేటాయించిన జలాలనే వాడుకుంటున్నామని అంతకు మించి చుక్క నీరుకూడా వాడుకోవడం లేదన్నారు. అలాగే కొత్త ప్రాజెక్టులను సైతం నిర్మించడం లేదన్నారు. లేని సమస్యను ఉన్నట్లుగా సృష్టించి ప్రజలను రెచ్చగొట్టడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులను కంట్రోల్ చేయాలని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సూచించారు.

Advertisement

Next Story

Most Viewed