దొడ్డు బియ్యం తిన్న ఈటలకు వేల కోట్లు ఎక్కడివి: కౌశిక్ రెడ్డి

by Sridhar Babu |
దొడ్డు బియ్యం తిన్న ఈటలకు వేల కోట్లు ఎక్కడివి: కౌశిక్ రెడ్డి
X

దిశ, జమ్మికుంట: ఈటల రాజేందర్ దళితులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దళిత బంధు డబ్బులు ఇస్తుంటే ఈటలకు అంత బాధ ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేను దొడ్డు బియ్యం తిన్నాను, నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఆర్ కృష్ణయ్య హాస్టల్లో చదివించాడని చెప్పిన ఈటల రూ. వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు.

‘టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచుతుంది’ అన్న ఆరోపణలు అవాస్తవమని.. కుట్టు మిషన్లు, గోడ గడియారాలు, బొట్టు బిళ్ళలను ఈటల రాజేందర్ ప్రతి గ్రామంలో పంచుతున్నారని ఆరోపించారు. పంచేదంతా అవినీతి సొమ్ము అన్నారు. మంత్రి హరీష్ రావును విమర్శించే అర్హత ఈటల రాజేందర్‌కు లేదని ఎద్దేవా చేశారు. లెఫ్ట్ భావజాలం అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌‌ను గెలిపించి సీఎం కేసీఆర్‎కు బహుమతిగా ఇస్తామని పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story