తెలంగాణ వాసుల ట్రాక్టర్లపై కర్ణాటక రైతుల దాడి

by Shyam |
Karnataka farmers
X

దిశ, మక్తల్: తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది సేలం వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఈ వాగు ఇరు రాష్ట్రాల మధ్య ఉంది. ఈ క్రమంలో నాగిరెడ్డిపల్లి శివారులో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఆదివారం తమ ట్రాక్టర్లలో ఇసుకను నింపసాగారు. దీనిని గమనించిన కర్ణాటక ప్రాంత రైతులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఇసుక తవ్వకాలు చేస్తోన్న తెలంగాణ ప్రాంత వాసుల ట్రాక్టర్లపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో ట్రాక్టర్లను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇరు రాష్ట్రాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అనంతరం కర్ణాటక పోలీసులు పట్టుబడిన ట్రాక్టర్లను సైదాపూరు పోలీస్టేషన్‌కు తరలిస్తుండగా మక్తల్ పోలీసులు అడ్డుకున్నారు. పట్టుబడినవి తమ పరిధిలోని ట్రాక్టర్లు అని ఊట్కూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, సంఘటన కర్ణాటక రాష్ట్రంలో కేసు నమోదైతే లక్ష రుపాయల జరిమానా కట్టడంతో పాటు ట్రాక్టర్ విడుదల కావడానికి రెండు నెలల సమయం పడుతుందనే ట్రాక్టర్ల యజమానులు ఇక్కడికి తీసుకొచ్చి కేసులు నమోదు చేయించారని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కాగా, గతంలోనూ ఇరుప్రాంతాల ప్రజల మధ్య గొడవలు జరిగాయని సమాచారం. ఈ గొడవలకు సంబంధించిన కేసులు కోర్టులో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed