కరీంనగర్‌లో పొలిటికల్ ‘కరోనా’ !

by Sridhar Babu |
కరీంనగర్‌లో పొలిటికల్ ‘కరోనా’ !
X

దిశ, కరీంనగర్: ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతోంది. మందే లేని ఈ వైరస్‌ను కట్టడి చేయాలన్న సంకల్పంతో అన్ని దేశాల్లో తలమనకలై ఉన్నారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కొనసాగిస్తున్నారు రాజకీయనాయకులు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా పరిమితం అయితే, జిల్లాకు చెందిన కొంతమంది ఈ అవకాశాన్ని వదులుకోవడం లేదు. దీంతో సరికొత్త ఎత్తులు, పై ఎత్తులు సాగుతున్నాయి. అంతా విచిత్రంగా అనిపిస్తున్న పూర్వ కరీంనగర్ జిల్లాలో సాగుతున్న తంతు ఇదే మరి.

కరోనా కారణంగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజేషన్‌తో పాటు సోషల్ డిస్టెన్స్ అన్న అంశం గురించే అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ నిబంధనలే కొందరికి అస్త్రంగా మారిపోయినట్టు ఉన్నాయి. రెండ్రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లిలో సింగరేణి భూ నిర్వాసితులకు జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పరిహారం అందజేశారు. ఈ విషయంపై కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ శశిభూషన్ కాచె జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు పలువురికి ట్విట్టర్ ద్వారా కూడా సమాచారం చేరవేశారు. పుట్ట మధు పరిహారం అందించిన ఈ సభకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారని అక్కడ సామాజిక దూరం పాటించ లేదంటూ కాచే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మర్నాడు మంథని నియోజకవర్గకేంద్రంలో ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసరాలను అందజేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ కూడా జిల్లా అధికారులకు శ్రీధర్‌బాబు పై ఫిర్యాదు చేశారు. మునిసిపల్ కార్మికులకు నిత్యవసరాల సరుకులు అందించే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించ లేదని ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మంథని సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా విమర్శనాస్త్రాలు చేసుకుంటున్నారు.

మరో వైపున కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో కూడా సోషల్ డిస్టెన్స్ వ్యవహారం దుమారాన్నే రేపుతోంది. ఈ గ్రామంలో రెండ్రోజుల క్రితం మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలోసామాజిక దూరం పాటించలేదంటూ మార్క్‌ఫెడ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యునిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తండ్రి మల్లయ్యపై కేసు నమోదు చేశారు. సింగిల్ విండో డైరక్టర్ కూడా అయిన మల్లయ్యపై కేసు నమోదు కావడం టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం మొదలైంది. ఈ మార్క్‌ఫెడ్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధికారులు కూడా వచ్చారని వారిపై కేసు ఎందుకు నమోదు కాలేదని మల్లయ్య ప్రశ్నిస్తున్నారు. కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడేందుకే తనపై మాత్రమే కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మల్లయ్య గురువారం సాయంత్రం తన ఇంట్లోనే స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. సామాజిక దూరం పాటించని వారందరిపైనా కేసులు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కేవలం హిమ్మత్‌నగర్ గ్రామంలో జరిగిన కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికే పరిమితం కాకుండా హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రారంభం అయిన ప్రతిచోట కూడా ఇదే పద్ధతి కొనసాగింది కాబట్టి అన్నిచోట్ల కేసు నమోదు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. 24గంటలుగా ఇంట్లోనే స్వీయ నిర్బంధం అయిన మల్లయ్య అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో సోషల్ డిస్టెన్స్ కారణంగా జురుగుతున్న ఈ వార్ తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. కరోనా రక్కసి సమాజాన్ని కలవరపెడుతుంటే, సామాజిక దూరం అంటూ నాయకుల మధ్య వార్ కొనసాగుతుండడం ఏంటన్న చర్చ సాగుతోంది.

Tags: Corona Virus, Karimnagar, Shashibhushan Kache, Single Window Director Mallaya, Putta Madhu, Mandhani, MLA Sridhar Babu

Advertisement

Next Story

Most Viewed