యూఎస్ ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్

by vinod kumar |
యూఎస్ ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్
X

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో భారత మూలాలున్న మహిళ కమలా హారిస్‌ చరిత్ర సృష్టించనున్నారు. ఆ దేశ ఉపాధ్యక్ష రేసులో దూసుకెళ్లనున్నారు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్‌ను ఎంచుకున్నారు. రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన నల్లకలువ బరాక్ ఒబామా మన్ననలు పొందిన ఆఫ్రికన్-అమెరికన్ కమలా హారిస్‌ ఏ విషయంలోనైనా ధైర్యంగా దూసుకెళ్లే సత్తా, డొనాల్డ్ ట్రంప్‌ను పదునైన మాటలతో ఇరుకునపెట్టే చురుకుదనమున్న కమలా హారిస్‌ను డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష రేసులో ఎంచుకోవడానికి సంతోషపడుతున్నారని జో బిడెన్ ప్రకటించారు.

కమలా హారిస్ ఆఫ్రికన్-అమెరికన్ అయినప్పటికీ భారత మూలాలున్నాయి. ఆఫ్రికా దేశం జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్, భారత్‌కు చెందిన శ్యామల గోపాలన్‌ల కూతురే కమలా హారిస్. వలసలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే ట్రంప్‌ను ఎదుర్కోవడానికి నల్లజాతీయులు, శ్వేతజాతీయేతరుల బలమైన మద్దతున్న కమలా హారిస్ ఎంచుకోవాలని డెమొక్రాట్లు భావించారు. నిజానికి ఉపాధ్యక్ష అభ్యర్థి కోసం కనీసం నెలపాటు తీవ్రంగా వేట సాగింది.

78ఏళ్ల బిడెన్ ఒకవేళ ఈ సారి అధ్యక్షుడిగా ఎన్నికైతే 2024లో మరోసారి పోటీ చేయడం దాదాపు అసాధ్యమే. రెండో పర్యాయము అధ్యక్ష పోటీకి ఆసక్తి లేదని సూచనప్రాయంగా బిడెన్ వెల్లడించారు కూడా. ఈ నేపథ్యంలోనే ఒకవేళ డెమొక్రాట్లే విజయం సాధిస్తే ప్రస్తుత ఉపాధ్యక్షురాలే వచ్చే ఎన్నికల్లోనూ అధ్యక్ష పోటీకి బరిలో దిగే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎంపికవడంపై డెమొక్రాట్లు సహా అటు జమైకా, ఇటు భారత్‌లోనూ ఆనందోత్సాహాలు వెలువడుతున్నాయి.

Advertisement

Next Story