కొత్త పార్లమెంట్ నిర్మాణం అవసరమా: కమల్ హాసన్

by Shamantha N |
కొత్త పార్లమెంట్ నిర్మాణం అవసరమా: కమల్ హాసన్
X

చెన్నై: దేశంలోని సగం జనాభా ఆకలి మంటల్లో దహించుకుపోతుంటే ఇప్పుడు కొత్త పార్లమెంటు నిర్మించాల్సిన అవసరమేముందని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాంపెయిన్‌ మొదలుపెట్టిన కమల్ హాసన్… బీజేపీపై విమర్శలు కురిపించారు. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తరుణంలో భారీ ఖర్చుతో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించడమెందుకు అని అడిగారు.

దేశంలోని సగం జనాభా ఆకలితో అల్లాడుతున్నారని, ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి తరుణంలో రూ. వెయ్యి కోట్లతో కొత్త భవనం నిర్మించడం సమంజసమేనా? అని పేర్కొన్నారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను నిర్మిస్తున్నప్పుడు వేలాది మంది చనిపోయారని, కానీ, అప్పుడూ పాలకులూ ఆ గోడను ప్రజల రక్షణ కోసమే నిర్మిస్తున్నామని చెప్పారని గుర్తుచేశారు. ఎవరిని రక్షించడానికి వెయ్యి కోట్ల పార్లమెంట్ భవనం అని ప్రశ్నించారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ప్రధానిని కోరారు. ఈ నెల 10న కొత్తపార్లమెంటు భవన నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed