డా.కఫీల్‌ విడుదలపై ప్రియాంక హర్షం 

by Shamantha N |
డా.కఫీల్‌ విడుదలపై ప్రియాంక హర్షం 
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్ ఖాన్‌పై దేశ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద మోపిన అభియోగాలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. అతన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కఫీల్ ఖాన్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని ఆయన తల్లి నుజహత్ పర్వీన్ దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ గోవింద్ మాథుర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

గతేడాది డిసెంబర్ 10న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో డాక్టర్ కఫీల్ ఖాన్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగించారని, ఇరువర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా మాట్లాడారని ఎన్ఎస్ఏ కింద అభియోగాలు దాఖలయ్యాయి. జనవరి 29న కఫీల్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఫిబ్రవరి 10న అతనికి బెయిల్ మంజూరైన రెండు రోజుల తర్వాత అతనిపై ఎన్‌ఎస్ఏ కింద అభియోగాలు నమోదయ్యాయి.

కఫీల్ ఖాన్ ప్రసంగంలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే విషయాలేవీ లేవని, అలీగఢ్‌లో అశాంతి రగిల్చే అంశాలేవీ లేవని హైకోర్టు తెలిపింది. జిల్లా మెజిస్ట్రేట్ కావాలనే కొన్ని వ్యాఖ్యలను ఉటంకించి అసలు ఉద్దేశ్యాన్ని పట్టించుకోలేదని అర్థమవుతున్నదని పేర్కొంది. కఫీల్ ఖాన్‌పై ఎన్ఎస్ఏను తోసిపుచ్చుతూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కఫీల్ ఖాన్‌కు తనపై మోపిన ఆరోపణలు కూడా తెలియనివ్వలేదని అతని న్యాయవాది మనోజ్ కుమార్ తెలిపారు.

ఫిర్యాదులో పేర్కొన్న ప్రసంగ పత్రాన్ని లేదా సీడీలోని విషయాలను ఆయన వినలేకపోయారని, ఇన్నాళ్లు ఏ తప్పు చేశారో కూడా తెలియకుండానే జైలులో గడిపారని వివరించారు. ప్రస్తుతం కఫీల్ ఖాన్ మథుర జైలులో ఉన్నారు. కోర్టులో హాజరుపర్చకుండా ఒక నిందితుడిని ఏడాదిపాటు అదుపులో ఉంచే అధికారం ఎన్ఎస్ఏ ప్రభుత్వానికిస్తుంది.

కోర్టు ఎన్ఎస్ఏ తొలగించిన తర్వాతైనా డాక్టర్ కఫీల్ ఖాన్‌ను యూపీ ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపులకు పూనుకోకుండా విడుదల చేస్తుందని ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. న్యాయాన్ని ప్రేమించేవారందరికీ కంగ్రాట్స్ అంటూ ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed