లైఫ్‌ను రివర్స్ చేసిన పోటీ పరీక్ష

by Anukaran |   ( Updated:2020-11-19 04:39:56.0  )
లైఫ్‌ను రివర్స్ చేసిన పోటీ పరీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: తనంతట తాను రాజీనామా చేస్తే తప్ప భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగిని తీసేయడం దాదాపుగా అసాధ్యం. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు ఇక్కడ అంత క్రేజు. జీవితంలో దేన్నైనా తిరిగి ఇవ్వవచ్చు. కానీ, గడచిన సమయాన్ని తిరిగివ్వలేం. ప్రభుత్వోద్యోగ పోటీ పరీక్షకు చదివే అభ్యర్థి మాత్రం తన జీవితంలో ఆరేడేళ్ల సమయాన్ని ప్రిపరేషన్ కోసం అంకితం చేస్తాడు. ఎందుకంటే ఒక్క పోటీ పరీక్ష రాసి ఎంపికైతే జీవితంలో హాయిగా సెటిల్ అవ్వొచ్చనే ధైర్యం. అది నిజమే…పోటీ పరీక్షలో నెగ్గి ఉద్యోగం సంపాదించి జీవితంలో సంతోషంగా గడుపుతున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు.

కానీ, జీవితాన్ని తలకిందులు చేసిన పోటీ పరీక్ష కూడా ఒకటి ఉంది. ఆ పోటీ పరీక్ష రాసి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నవాళ్లందరూ ఇప్పుడు ఎంత క్షోభ అనుభవిస్తున్నారంటే..అసలు నేను పరీక్ష రాయకపోతే నా జీవితం ఇంకా బాగుండేదేమోనని రోజూ రాత్రి పశ్చాత్తాపంతో నిద్రపోతున్నారు. నిజానికి వాళ్లు పోటీ పరీక్షను నిందించడం లేదు. ఆ పోటీ పరీక్ష రాయడానికి కారణమైన వారి మనోనిర్ణయాన్ని నిందిస్తున్నారు. మరి ఆ పోటీ పరీక్ష ఏది? వాళ్లు అనుభవిస్తున్న క్షోభ ఏంటి?

జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోటీ పరీక్షకు నోటిఫికేషన్ పడగానే అప్లై చేశారు. కొలువు సాధించారు. కానీ, నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన క్లాజులను తేలికగా తీసుకున్నారు. అదే ఇప్పుడు వారి పాలిట యమపాశమై కూర్చుంది. తామిచ్చిన అగ్రిమెంట్‌లో క్రమసంఖ్య 6లో మా విధులు మీకు సంతృప్తికరంగా లేకపోతే మీరు మమ్ములను తొలగించొచ్చు. అందుకు మేము అంగీకరిస్తున్నాం అని ఉంది. ఈ విషయాన్ని వీరు పట్టించుకోలేదు. మూడేళ్ల తర్వాత పర్మినెంట్ అవుతుందనే ఒకే ఒక్క ఆశతో ఎవరు ఏం చెప్పినా చేశారు. ఎన్ని మాటలైనా పడ్డారు. స్టేటస్‌ను, ఆత్మాభిమానాన్ని పక్కనపెట్టి పనిచేశారు. అలా పనిచేస్తూ సంవత్సరంన్నర గడిపేశారు. ఇన్నాళ్లు మెమోలు, షోకాజు నోటీసులు అందుకున్నారు. వాటికి తగినట్లుగా పనితీరు మార్చుకుని గ్రామ పంచాయతీల్లో మెప్పుపొందారు. అయినప్పటికీ టర్మినేట్‌లు చేస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు. టర్మినేట్ అయిన వాళ్ల సంగతి పక్కన పెడితే ఉద్యోగం చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వీరు ఏ రోజూ ప్రశాంతంగా లేరు.

ఇలా వణకిపోవడానికి కారణం ఏంటి? ఇలా బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఒక్క తొందరపాటు నిర్ణయం వల్లనే వచ్చింది. నేటి యువత చేసే అతిపెద్ద తప్పిదం ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం. జీవితంలో రిస్క్ తీసుకోవాలనుకోవడం కరక్టే. కానీ, ఆ రిస్క్ మన కంట్రోల్‌లో ఉండేదిగా ఉండాలి. ప్రభుత్వోద్యోగం అనే ఒకే ఒక్క మిథ్యలో పడికొట్టుకోవడమే ఇవాళ..వారి ఈ పరిస్థితికి కారణమైంది. ఎంత కష్టపడినా, ఎంత చేసినా ఏదో రకంగా టార్గెట్ చేసి టర్మినేట్ చేస్తున్నారని కొందరు జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు అభిప్రాయపడుతున్నారు. చివరికి అగ్రిమెంట్, నోటిఫికేషన్ ప్రస్తావన రాగానే తమ నిర్ణయాన్ని తామే నిందించుకుంటున్నారు. అలా టర్మినేట్ చేయడానికి అవకాశం ఇచ్చింది వాళ్లేనని అర్థమై దీర్ఘాలోచనలో పడుతున్నారు. కాబట్టి జీవితంలో ఎప్పుడూ ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలనే విషయం నేటి యువత గుర్తుంచుకోవాలి. ఇది లేకున్నా ఇంకొకటి ఉందనే భరోసా ఏర్పరుచుకోవాలి.

ఈ ఇంటర్నెట్ యుగంలో అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఒకటికి రెండు పనులు చేస్తున్న వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత నిరుద్యోగం రేటు మరింత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా యువత ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. నేర్చుకోవడానికి, ఉపాధి పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందుకే కాలాన్ని, సమయాన్ని వృథా చేయకుండా ఎప్పటికప్పుడు మారుతున్న కాలంతోపాటు ముందుకెళ్లాలి. ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి కొత్త నోటిఫికేషన్లు వస్తాయని ఇప్పటికీ గ్రామీణ యువత పుస్తకాలను పిప్పి చేస్తున్నారు. చదవడం తప్పు అనడం లేదు..అలా చదివిన పాఠాలను మళ్లీ గుర్తుంచుకోవడానికి వీలుగా యూట్యూబ్‌లో వీడియో తరగతులుగా మార్చండి. అప్పుడు మీరు చదివినట్లు ఉంటుంది. అలాగే యూట్యూబర్‌గా మారినట్లూ ఉంటుంది. ఇలా చేస్తున్న పనిలోనే ప్రత్యామ్నాయం చూసుకోవడం వల్ల, ఒకేదాని మీద ఆధారపడి జీవించే అవసరం తగ్గుతుంది!

Advertisement

Next Story