జర్నలిస్ట్ వారియర్స్.. ఎవరికీ పట్టరు..

దిశ, న్యూస్ బ్యూరో:

“ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో
మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో..”

అంటూ మహానుభావుడు దాశరథి ఓ రాజును గెలిపించడానికి, సామాజిక సమస్యల్లో బలైన ఎందరో యోధులు నేలకొరిగారని కీర్తించారు. ప్రస్తుతం కరోనా యుద్ధంలో దాగిన బడబానలం జర్నలిస్టులం. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు డెస్క్ జర్నలిస్టులు. సమాజాన్ని జాగృతం చేస్తోంది వీరే. క్షణం క్షణం అప్రమత్తత, అనివార్యతను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకున్నారు. మీడియా ఓ గంట మౌనం వహిస్తే.. ఒక్క రోజు విధులకు దూరమైతే.. ప్రపంచమే అంధకారమవుతుంది. ఎక్కడేం జరిగిందో ఊహించలేం. ఎవరేం అయ్యారో అంతుచిక్కదు. ఎవరికి ఏ బాధ వచ్చినా మీడియాకు చెప్పాలనుకుంటారు. కానీ మీడియా ప్రతినిధులకే బాధలు వస్తే వినేవారే కరువు. ఉద్యోగ బాధ్యతను ప్రాణాలకు తెగించి నిర్వర్తిస్తున్నారు. కరోనా కష్టకాలంలో తెలంగాణలో సుమారు 100 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక టీవీ జర్నలిస్టు చనిపోయాడు. ఆ కుటుంబానికి పెద్ది దిక్కు లేకుండా పోయింది. ప్రభుత్వం ఆదుకోలేదు. కానీ తోటి జర్నలిస్టులు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. కరోనా పేరుతో జిల్లాల టాబ్లాయిడ్‌లు నడపలేమని యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో వందలాది మంది డెస్క్ జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. దాదాపు అన్ని మీడియా సంస్థలూ ఇదే బాట పట్టడంతో మరో చోట ఉద్యోగం దొరికే అవకాశాలు లేకుండా పోయాయి.

గుర్తింపు ఏది?

కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిన యోధులు (ఫ్రంట్‌లైన్ వారియర్లు)గా వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి గుర్తింపు లభించింది. కానీ అదే తరహాలో మృత్యువు ఒడిలో తలపెట్టి సమాజ హితాన్ని కోరుతూ విధులు నిర్వహిస్తోన్న జర్నలిస్టులకు ఎలాంటి గుర్తింపు లేదు. అటు ప్రభుత్వం పట్టించుకోదు. ఇటు యాజమాన్యం కనికరించదు. ఖరారు చేసిన జీతాలకు భరోసా లేదు. ఉద్యోగానికి కూడా భద్రత లేకుండా భయం గుప్పిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది గుర్తింపు కోసం ఆరాటం కాదు. కానీ బతుకు కోసం పోరాటం. కరోనా వైరస్‌తో హై రిస్క్‌లో ఉన్న జాబితాలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. ప్రభుత్వ చర్యలను, వైద్యుల సేవలను, పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని సమాజం దృష్టికి తీసుకొస్తున్నదీ జర్నలిస్టులే. కరోనా వైరస్‌పై యుద్ధంలో ఆయుధాలు లేకుండా పోరాడుతోన్న వృత్తిని కష్టంగానైనా ఇష్టంతోనే నిర్వహిస్తున్నారు. కానీ ఆ భయానక పరిస్థితుల్లోనూ జన జాగృతం చేస్తోన్న జర్నలిస్టుల జీవితాలకు గుర్తింపు, భద్రత కరవైతే భవిష్యత్తు ప్రమాదకరమే.

ఎప్పటికప్పుడు సమాచారాన్ని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడానికి వైరస్‌తోనే సహజీవనం చేస్తున్నారు. వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల జాబితాలో యువ జర్నలిస్టులు చేరుతుండడం బాధాకరం, ఆందోళనకరం. కుటుంబ సభ్యుల ఆందోళన, ఆవేదన మీడియాకెక్కని, సామాజిక మాధ్యమాలకు చిక్కని కన్నీళ్లు. డ్యూటీకి వెళ్లిన తన తండ్రి ఎప్పుడొస్తడోనని ఎదురుచూసే బిడ్డకు, క్షేమంగా తిరిగి రావాలని కోరుకునే భార్యకు, తల్లికి రిప్లయి కూడా ఇవ్వలేని దుస్థితి. కన్నబిడ్డలను దగ్గరికి తీసుకోలేని దైన్యంలో వందలాది మంది మీడియా ప్రతినిధులు ఉన్నారు. హోం క్వారంటైన్‌కు జాగాలేని ఇండ్లల్లో గడుపుతోన్న వేలాది జర్నలిస్టు కుటుంబాలు కొవిడ్-19 భయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇంటి యజమానుల ఈసడింపులతో కాలం వెళ్లదీస్తోన్న బతుకులకు భరోసా ఇచ్చే అదృశ్య శక్తి కోసం ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది మంది వైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్, చెన్నై, ముంబయి, ఢిల్లీ తదితర నగరాల్లో కొందరు కరోనాతో కలం యోధులు మృత్యువాత పడ్డారు.

జీవితానికి బీమా లేదాయె!

కేంద్ర ప్రభుత్వం కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లకు బీమా సౌకర్యం కల్పించింది. కానీ పాలకులకు మీడియా కనిపించలేదు. సమాజాన్ని మేల్కొల్పుతున్న వారికి ప్రభుత్వం, యాజమాన్యం భద్రతను దూరం చేస్తున్నాయి. ఆఖరికి ఉద్యోగాలకు, కనీస వేతనాలకు, జీవితాలకు భరోసా లేకుండా చేస్తున్నాయి. కరోనా వైరస్ సోకితే ప్రైమరీ కాంటాక్టులో ఉన్న సహచర సిబ్బందికి క్వారంటైన్ సౌకర్యం ఉంటుంది. వేతనంతో కూడిన సెలవు ఉంటుంది. షిప్టుల వారీగా పని చేసుకునే సౌలభ్యం ఉంది. కానీ మీడియా ప్రతినిధులకు మాత్రం అలాంటివేవీ లేవు. కొన్నిసార్లు విరామం లేకుండా రోజంతా పని చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సగం వేతనాన్ని కత్తిరించినా ఈ మూడు రంగాల ఫ్రంట్‌లైన్ వారియర్లకు మాత్రం ఎలాంటి కోత పెట్టలేదు. మీడియా యాజమాన్యం మాత్రం 25 శాతం నుంచి 70 శాతం దాకా కోత పెట్టింది. అడిగే ధైర్యం ఉండదు. అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయం. నిత్యం అభద్రత మధ్యనే బతుకు. వేతనం కత్తిరించడానికి యాజమాన్యానికి రెవిన్యూ పడిపోయిందనే సాకు దొరుకుతోంది. కానీ జర్నలిస్టులకు మాత్రం ఇంటి అద్దె, కుటుంబ అవసరాలు, రోజువారీ ఖర్చులు లాంటివాటికి ఈ సాకులేవీ పని చేయవు. కరోనా వార్డుగానీ, మార్చురీగానీ, కంటైన్‌మెంట్ జోన్‌ గానీ, శ్మశానం గానీ.. ఎంత హై రిస్కు ఉన్నా తప్పని రిపోర్టింగ్. డ్యూటీకి వెళ్ళకుంటే ఉద్యోగం ఉండదు. ఉద్యోగం పోతే రోడ్డున పడతామన్న భయం. దినదినగండంగా జర్నలిస్టులు బతుకులు గడిపేస్తున్నారు.

అన్నింటా ఫస్టే..

భూకంపం, తుపానులు, వరదలు, గ్యాస్ లీకేజీ, రైలు ప్రమాదాలు, రాజకీయ పార్టీల బహిరంగ సభలు, ప్లీనరీలు, మీడియా కాన్ఫరెన్సులు.. చివరకు గణేశ్ నిమజ్జనం.. ఇలా ఏదైనా అందరి కంటే ఒక అడుగు ముందే, గంట ముందే ఉండేది మీడియా. తెల్లవారుజామున, అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం.. అనే తేడా లేదు. లోకమంతటికీ ఆ సమాచారాన్ని ముందుగానే చేర వేయాలన్న కుతూహలం.. ఆతృత. ఏం జరిగింది, ఎలా జరిగింది అంటూ ఆ సంఘటనకు సంబంధించిన సమస్త సమాచారాన్ని చేరవేస్తారు. కానీ ఆ మీడియా ప్రతినిధులకే ఏమైనా జరిగితే ఏ ప్రభుత్వ పెద్దలూ, ఏ అధికారి, ఏ యాజమాన్యమూ, ఏ రాజకీయ నేతా ఆదుకోరు. జర్నలిస్టు మనోజ్ చనిపోయిన తర్వాత పరిణామాలు రాష్ట్ర పాత్రికేయలోకానికి స్వీయానుభవం. లాక్‌డౌన్‌ సమయంలో లాఠీల దెబ్బలు తిన్నారు, ప్రజల కష్టాలను సమాజానికి చేరవేశారు. కానీ చివరకు అటు సమాజం నుంచీ, ఇటు యాజమాన్యం నుంచి మరోవైపు ప్రభుత్వం నుంచి గుర్తింపుకు నోచుకోలేదు. ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య వారధి అనేవి మాటలకే పరిమితమైంది.

అవసరం ఉన్నంతవరకే..

గ్రామ స్థాయిలో గల్లీ లీడర్‌గా ఉండేవారు బడా నేతగా ఎదిగేవరకు మీడియాను విస్తృతంగా వాడుకుంటారు. ‘ఈ వార్త వచ్చేలా చూడండి.. నన్ను కొంచెం హైలైట్ చేయండి’ అంటూ ప్రాధేయపడినవారే. అధికారం రుచి మరిగిన తర్వాత కూరలో కరివేపాకులా తీసి పారేయడం వారికి రివాజుగా మారింది. తెలంగాణ ఉద్యమంలో అలా గల్లీ లీడర్‌గా ఉన్నవారు ఇప్పుడు వీఐపీలాగా కార్లలో తిరిగే వారిని చూస్తూనే ఉన్నాం. ప్రధాని మోడీ మొదలు ఎమ్మెల్యే వరకు అందరికీ మీడియా అవసరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. గరీబ్ కల్యాణ్ యోజన నుంచి రైతుబంధు, కల్యాణలక్ష్మి వరకు పథకాల గొప్పదనాన్ని ప్రజలకు చేరవేయడానికి ఈ మీడియా అవసరాన్ని గుర్తించినవారే. కానీ కరోనా కాలంలో మాత్రం ఫ్రంట్‌లైన్ వారియర్లలో ఒకరిగా గుర్తింపు ఇవ్వడానికి మనసు రావడంలేదు. మీడియాను తిట్టడానికి కూడా మీడియా సమావేశాన్నే ఎంచుకుంటున్నారు. కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లకు తాత్కాలిక బస, హోటళ్ళలో ఏర్పాట్లు ఉన్నాయి. కానీ జర్నలిస్టులు మాత్రం ఆ వైరస్‌ను రోజూ ఇంటికే మోసుకెళ్తున్నారు. పాజిటివ్ సోకితే మళ్ళీ మంత్రులతోనే పైరవీ చేయించుకోవాల్సి వస్తోంది. కరోనా పరీక్షలకు సైతం మంత్రుల సిఫార్సులు అవసరమైంది. కంటితుడుపుగా పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల పేరుతో నాసిరకాలవి అందించి పాలకపక్షం గొప్పగా చెప్పుకుంటోంది. మంత్రి, సెలెబ్రిటీ దగ్గినా, చీదినా ప్రధాన వార్తే. సెలెబ్రిటీకి జలుబు చేసినా ప్రధాన శీర్షికే. కానీ అది రాసిన, చూపించిన ఆ జర్నలిస్టు కరోనాతో చనిపోయినా ఆపన్నహస్తానికి ఎదురుచూపే. పాజిటివ్ వస్తే ఆ కుటుంబం బతుకు చిత్రం అవమానకరమే. అనుమానిత జీవితమే. పాలకులెప్పుడు గుర్తిస్తారో, యాజమాన్యాలకు కనువిప్పు ఎప్పుడు కలుగుతుందోనని జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారు.

బంగారు తెలంగాణలో ఆశించింది ఇది కాదు: విరాహత్ ఆలీ

“కరోనా బారిన పడి కళ్ళ ముందే ఒక యువ జర్నలిస్టు చనిపోయాడు. కనీసం ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందించలేదు. సాటి జర్నలిస్టులే తలా కొంత చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. చనిపోయిన వ్యక్తికే సాయం చేయని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు కరోనా బారిన పడకుండా ఏదో సాయం అందుతుందని ఆశించలేం. బంగారు తెలంగాణలో జర్నలిస్టుల బతుకులు ఇలా అయ్యాయి. జర్నలిస్టులను అవసరానికి వాడుకునేవారే తప్ప ఏ మాత్రం వారికి గుర్తింపూ లేదు, గౌరవం అంతకన్నా లేదు. మీడియా సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రత్యక్షంగానో పరోక్షంగానో యాజమాన్యంగా పాలకులు కొనసాగుతుండడం వల్లనే జర్నలిస్టులకు న్యాయం జరగడంలేదు. ఆ అజమాయిషీ కొనసాగినంత కాలం న్యాయం జరుగుతుందని ఆశించలేం. ఇప్పుడు కరోనా కావచ్చు.. భవిష్యత్తులో మరొకటి కావచ్చు.. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి భరోసా లభిస్తుందన్న నమ్మకం లేదు” అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ అనుబంధం) ప్రధాన కార్యదర్శి విరహత్ ఆలీ వ్యాఖ్యానించారు.

గుర్తింపే కాదు.. భరోసా కూడా లేదు: మారుతీసాగర్

“కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లుగా జర్నలిస్టులకు గుర్తింపే కాదు.. వారికి తగిన భరోసా కూడా ప్రభుత్వం నుంచి లేదు. వార్తల కవరేజీలో వైరస్ బారిన పడుతున్న జర్నలిస్టులు, వారి కుటుంబాలకు జరుగుతున్న ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాం. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. తెలంగాణ సైతం రూ.20 లక్షల బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశాం. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని మంత్రి కిషన్ రెడ్డి ద్వారా తీసుకెళ్ళాం. ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఇచ్చినట్లుగా రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరాం. విధాన నిర్ణయం కాబట్టి టైమ్ పడుతోంది. ఈ లోపు రాష్ట్ర మీడియా అకాడమీ ద్వారా పాజిటివ్ బారిన పడిన వ్యక్తులకు తలా రూ.20 వేలు, హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారికి రూ.10 వేల చొప్పున చేతనైన సాయం ఫండ్ నుంచి అందిస్తున్నాం” అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ పేర్కొన్నారు.

Advertisement