అడుగుకో గుంత.. గజానికో గొయ్యి : ఏపీ రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

by srinivas |
Janasena chief Pawan Kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రోడ్ల వ్యవస్థ దారుణంగా తయారైందని మండిపడ్డారు. ‘అడుగుకో గుంత.. గజానికో గొయ్యి’ ఉందని పవన్ విమర్శించారు. ఒక దేశం లేదా రాష్ట్రం.. ప్రాంతం అభివృద్ది చెందాలంటే రహదారుల కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేలాది కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తూ ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. నివర్ తుఫాన్ సమయంలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు రోడ్ల దుస్థితిని ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో సుమారు 8 కి.మీ. మేర రోడ్డు పాడైపోయిందన్నారు. ఆ గుంతలో ఓ ట్రాక్టర్, గర్భిణి వెళ్తోన్న ఆటో తిరగబడిపోయినట్లు పవన్ వెల్లడించారు. రోడ్ల దుస్థితిపై ప్రజాప్రతినిధికి చెప్పినా.. ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదన్నారు. రోడ్ల గురించి ప్రశ్నిస్తే లాఠీఛార్జీలు చేయించే పరిస్థితులు దాపురించాయని పవన్ మండిపడ్డారు.

బాగు చేస్తే సరి లేకపోతే అక్టోబర్ 2న మేమే బాగు చేస్తాం

రాష్ట్రంలో లక్షా 20 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయని.. ఈ రోడ్లు దెబ్బతిన్నా జగన్ సర్కార్ బాగు చేయడం లేదన్నారు. కరోనా ప్రభావం మూలంగా ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనే ఆలోచనతో ఇంతకాలం ఓపికపట్టామని తెలిపారు. అయితే, ప్రజల ప్రాణాలకే ముప్పు తెచ్చేలా రోడ్లు ఉండటంతో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. రోడ్డు బాగోలేదు, ఏదైనా చేయండి అని స్థానిక ప్రజాప్రతినిధిని అడిగినందుకు గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్యనాయుడు అనే జనసైనికుడు ఆత్మహత్యకు పాల్పడేలా వేధించారని పవన్ ఆరోపించారు. రోడ్ల దుస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2న రోడ్లను శ్రమదానం చేసి మనమే బాగు చేసుకుందామని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed