Jai Bhim సినిమా నా జీవితంలా ఉంది: ఎంపీ రఘురామ రాజు

by srinivas |   ( Updated:2021-11-05 08:58:45.0  )
raghu ram raju
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు జైభీమ్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా చూస్తే తన జీవితంలాగే అనిపించిందని చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఈ సినిమాలో గిరిజన యువకుడిని లాకప్‌లో హింసిస్తుంటే గతంలో నాకు జరిగిన అనుభవాలే గుర్తొచ్చాయి. ఇది సినిమాలాగా అనిపించలేదు. నా జీవితమే అనిపించింది. ఆ సినిమాలో గిరిజన యువకుడికి ఎంతో అన్యాయం జరిగింది. ఆ గిరిజనుడు సంగతి అటుంచితే నేనెవరిని… ఎంపీని. నాకు దిక్కులేదు. సీబీఐ విచారణ కోరుతూ మా అబ్బాయి కోర్టును ఆశ్రయించాడు. ఆర్నెల్లుగా దిక్కు లేదు. నన్ను కాపాడేందుకు చంద్రు లాంటి న్యాయవాది కోసం చూస్తున్నా’ అంటూ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను అందరూ చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘సినిమా చూసిన తర్వాత హీరో సూర్యకు ఫోన్ చేసి నా స్పందన తెలియజేశాను. నా జీవితంపైన కూడా ఓ సినిమా తీయాలని కోరాను. జై భీమ్-2 తీస్తారేమో చూడాలి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పెట్రోల్ ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలి
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వాహనదారుల కష్టాలను చూసిన ప్రధాని నరేంద్రమోడీ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకంను తగ్గించారని గుర్తు చేశారు. సుంకం తగ్గించడం వల్ల నేడు ప్రధాని మోడీని ప్రజలు కీర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రధాని మోడీ పిలుపుతో చాలా రాష్ట్రాలు పెట్రో పన్నులను తగ్గించాయని చెప్పారు. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయని రఘురామ ఆరోపించారు.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. మరోవైపు మద్యం ఆదాయంపైనా ఆయన సెటైర్లు వేశారు. రాష్ట్రంలో మద్యం ఆదాయం పక్కదారి పడుతోందని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎక్కువగా అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరు అంటూ ఎంపీ రఘురామ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed