- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల కోటలో కొత్త చర్చ..?
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో జత కట్టేందుకు వస్తున్నదెవ్వరో తెలుసుకోవడం ఆ వర్గానికి సవాల్‌గానే మారింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోని కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు ఈటలకు మద్దతుగా ఉంటామని చెప్పుతున్నారని, మరికొందరు కలిసేందుకు రావడం తెలిసిందే. ఈ పరిణామాల్లో ఈటల దగ్గరకు గులాబీ అధిష్టానం ఆదేశాల ప్రకారమే ఎవరైనా వస్తున్నారా.. లేదా టీఆర్‌ఎస్‌లో ఇమడలేక.. ప్రాధాన్యం దక్కక వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? అనేది స్పష్టంగా తేల్చుకోవాలంటూ ఈటల సన్నిహితులు సూచిస్తున్నారు. గురువారం రాత్రి కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు సమావేశమైన నేపథ్యంలో ఇలాంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. అయితే కొంతమందిని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నట్లు ఈటల వర్గంలో సమాచారం.
ఇప్పుడు అక్కడి సమాచారం ఎలా..?
మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ చుట్టూ భద్రతా వలయం, ఆయన వెంటే నిఘా వర్గాలు గిరేసి తిరిగాయి. అయినా అందరి కళ్లుగప్పి ఈటల రెండుసార్లు రహస్య మంతనాలకు వెళ్లినట్లు అనుమానించారు. రెండుసార్లు మంత్రి మిస్సింగ్ అంటూ భద్రతా సిబ్బంది కూడా ప్రభుత్వానికి సమాచారమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈటలతో ఎవరెవరు టచ్‌లో ఉంటున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎలాంటి అంశాలపై చర్చిస్తున్నారనేది ప్రతి నిమిషం గులాబీ బాస్‌కు సమాచారం అందించేవారు. కానీ ఇప్పుడు భద్రతా వలయం తెగిపోయింది. మాజీ మంత్రి కావడం, ఈటల దగ్గర పరిమిత సంఖ్యలోనే సిబ్బంది ఉండటంతో కొత్తవాళ్లు ఎవరు అక్కడ తచ్చాడిన తెలుసుకునే వీలుంటుంది. అందుకే ప్రస్తుతం నిఘా వర్గాలు, ప్రభుత్వ వేగులు అక్కడకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈటలతో మంతనాలు చేస్తుందెవరు, ప్రధానంగా టీఆర్‌ఎస్ నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారనే అంశాలను తెలుసుకోవడం గులాబీ బాస్‌కు అనివార్యం. అందుకే కొంతమంది ఈటల వర్గంలోకి పంపిస్తున్నారనే టాక్స్ ఉన్నాయి. కావాలనే టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ ఈటల వర్గంలో ఉంటున్నట్లు ఉండాలని, కానీ అక్కడ జరిగే ప్రతి విషయం తెలుసుకుని చేరవేసేందుకు కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఈటలకు సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా వెళ్లి ఈటలతో చర్చించుకున్నారు. ఇలాంటి సమాచారం వెంటనే నిఘా వర్గాలకు, ప్రభుత్వ పెద్దలకు చెప్పే వేగులను అక్కడ ఏర్పాటు చేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్ నేత మాట్లాడిందెలా తెలిసింది..?
అంతేకాకుండా ఇటీవల వరంగల్జిల్లాకు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఈటలతో మాట్లాడినట్లు సమాచారం. ఆయన మాట్లాడినట్లు గులాబీ నేతకు సమాచారమిచ్చారంటున్నారు. ఆయనతో వరంగల్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేతో శుక్రవారం ఉదయమే మాట్లాడించినట్లు కూడా తెలుస్తోంది. ఈ లెక్కన ఈటల దగ్గర ప్రభుత్వ వేగులు ఉన్నారనే చర్చ మొదలైంది. కాగా ఈటల రాజేందర్ దగ్గరకు ఇప్పుడు వచ్చే నేతలెవ్వరు, అధికార పార్టీపై ఎందుకు అంత అక్కసుతో ఉన్నారనే అంశాలను క్షుణంగా పరిశీలించాలని ఆయనకు సలహాలు కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఉద్యమ నేత స్వయంగా ఈటలతో మాట్లాడి ఇప్పుడు ఇలాంటి వెన్నుపోటుదారులతోనే జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై కూడా ఈటల వర్గం కన్నేసినట్లు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చెప్పుకుంటున్నారు.