కాంగ్రెస్ కీలక నేత ఇంటిపై ఐటీ మెరుపు దాడులు!

by Sumithra |
IT executives
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగరంతో సహా యాదాద్రిలోని రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. గత ఆరేళ్లుగా సుమారు రూ.700 కోట్లు నల్లధనంతో లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులకు దిగారు. హైదరాబాద్ ఎల్‌బీ నగర్, యాదాద్రి జిల్లా ఆలేరు ప్రాంతాలలో వెంచర్లు, అపార్ట్‌‌మెంట్లు నిర్మిస్తూ.. ఐటీ పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సంస్థలను అధికారులు గుర్తించారు. వీటిని జేఎస్సార్, స్పెక్ట్రామ్ సంస్థలుగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇంచార్జ్ బీర్ల అయిలయ్య ఇంటిపై కూడా సోదాలు జరిపినట్టు సమాచారం. ఈ సందర్భంగా సుమారు రూ.11.8 కోట్ల నగదు, రూ.1.93 కోట్ల విలువైన బంగారం స్వాదీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లు, లెక్కలోకి రాని లావాదేవీలకు సంబంధించి చేతిరాత పుస్తకాలను అధికారులు సీజ్ చేసినట్టుగా సమాచారం. ఈ వివరాలను ఐటీ అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

Advertisement

Next Story