- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రులు కళకళ.. ఐసోలేషన్ సెంటర్లు వెలవెల
దిశ, కరీంనగర్: ఫస్ట్ వేవ్ కరోనా సమయంలో కళకళలాడిన ఐసోలేషన్ కేంద్రాలు నేడు వెల వెలబోతున్నాయి. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లేందుకు బాధితులు స్వచ్ఛందంగా వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్పష్టం అవుతోంది. కరోనా పాజిటివ్ ఉందన్న అనుమానం వస్తే చాలు ఆసుపత్రులకు పరిగెత్తుతున్నారు చాలా మంది బాధితులు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.
నాడు.. నేడు..
ఫస్ట్ వేవ్ కరోనా సమయంలో వేల సంఖ్యలో బాధితులు ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంటే.. నేడు వందల సంఖ్యలకే పరిమితం అయ్యారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో గత సంవత్సరం వెయ్యి వరకు బాధితులు చేరగా, సెకండ్ వేవ్ లో 218 మంది మాత్రమే ఉన్నారు. సిరిసిల్లలో నిరుడు 534 మంది ఉంటే ఈసారి 119 మంది, పెద్దపల్లి లో 514 మంది ఉండగా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తరువాత 68 మంది, జగిత్యాలలో 634 మంది గతంలో ఉండగా ఈ సారి 160 మంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో చేరేందుకు బాధితులు ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి మాత్రం బాధితులు ఐసోలేషన్ కేంద్రాలవైపు అంతగా మొగ్గు చూపడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దవాఖాన్లకు పరుగులు..
కరోనా లక్షణాలు రాగానే ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వెంటనే ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొద్ది రోజులు జాయిన్ చేసుకుని పంపిస్తున్నారు. వాస్తవంగా ఫస్ట్ వేవ్ లో ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్న వారిలో 100 శాతం మంది రికవరీ అయ్యారు. ఈ విషయాన్ని కరోనా బాధితులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాకుండా పోయింది. తుమ్మినా, దగ్గినా కరోనా సోకిందా? అన్న భయం వారిని వెంటాడడమే ఇందుకు కారణమని అర్థం అవుతోంది. ఐసోలేషన్ కేంద్రాల్లో ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహారం తో పాటు మల్టివిటమిన్, జింక్, సి విటమిన్ ట్యాబ్లెట్లు కూడా సరఫరా చేస్తున్నారు. 14 రోజుల పాటు ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నవారు బాగై ఇళ్లకు కూడా వెళ్లిపోయారు.
ఆస్పత్రికి ఎప్పుడు వెళ్లాలంటే..?
కరోనా సోకిందని నిర్దారణ కాగానే ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ కావచ్చు. లేనట్టయితే ఐసోలేషన్ కేంద్రాల్లో అయినా జాయిన్ కావచ్చు. పౌష్టికాహారం తీసుకుంటూ, రోజుకు మూడు సార్లు పసుపు నీటిని మరిగించి ఆవిరి పట్టడం, ఉదయం, సాయంత్రం ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటితో గార్లింగ్ చేయడం, నీళ్లలో నానపెట్టిన బాదం తినడం, రోజుకొకసారి పసుపు వేసి మరిగించిన పాలను తాగడం చేయాలి. అలాగే డి విటమిన్ కోసం వేకువ జామున వచ్చే సూర్యుని కిరణాల శరీరానికి తాకేలా కొద్దిసేపు ఉండాలి. లేనట్టయితే బాయిల్డ్ ఎగ్, బాయిలర్ చికెన్ తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. వంటల్లో పెప్పర్ ఫౌడర్ వాడేందుకు ప్రాధాన్యత కల్పించాలి. ఫ్రై వంటకాలకు కొంతకాలం దూరంగా ఉండడం బెటర్ అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంట్లోనే బ్రహ్మాండమైన చిట్కా వైద్యాలు ఉన్నా కరోనా అనగానే అదేదో మాయదారి రోగం అని కలవరపడి ఆసుపత్రల వద్దకు పరుగులు పెట్టి డబ్బును వృధా ఖర్చు చేసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారినప్పుడు మాత్రమే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి తప్ప, చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి దవాఖానల వైపు చూడడం సరికాదని డాక్టర్లే సూచిస్తున్నారు.
భయం వీడండి..
ఫస్ట్ వేవ్ కరోనా సమయంలో లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైనా మానసిక దృఢత్వంతో కాలం వెళ్లబుచ్చిన జనం నేడు మాత్రం భయం అనే రక్కసి కోరల్లో చిక్కుకపోతున్నారు. రోగం వచ్చిందన్న ఆందోళనకంటే నాకేం కాలేదన్న ధీమాతోనే సగం వ్యాధి మటుమాయం అవుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చాలామంది పేషేంట్లు, డాక్టర్లు వద్ద వారికి సోకిన వ్యాధి గురించి సమగ్రంగా అడిగి తెలుసుకుంటూ ఎక్కువ సేపు సమయం వెచ్చిస్తారు. దీనివల్ల పేషేంట్లో మానసిక స్థైర్యం ఏర్పడుతుందని, సైకలాజికల్ గా పేషేంట్ తనకేమీ కాదు అన్న నమ్మకంతో ఉంటాడన్నదే ఆ డాక్టర్ల ఆలోచన. రోగిని సైకలాజికల్ గా మార్చనట్టయితే ఎంత ఖరీదైన వైద్యం అందించినా ఫలితం మాత్రం ఉండదని మానసిక వైద్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి కరోనా బాధితులు తమకేమీ కాలేదన్న ఆలోచనలతో ఉండాల్సిన అవసరం ఉంది.
ఆసుపత్రుల సంఖ్య పెరిగినా..
గత సంవత్సరం కరోనా కలవరపెట్టే నాటికి రోగం గురించి ఎవరికీ అవగాహన లేదు. ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మరో మూడు దవాఖానాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఈ సారి వందల సంఖ్యలో వంద వరకు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందించేందుకు పర్మిషన్ ఇచ్చినా వాటిల్లో బెడ్స్ దొరకని పరిస్థితి తయారైంది. ఇందుకు ప్రధాన కారణంగా కరోనా బాధితుల్లో మానసిక బలహీనత పెరగడమేనని గుర్తుంచుకోవాలి. అప్పుడు చాలా మంది తమ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండి ఆరోగ్యవంతులుగా మారిన వారు కోకొల్లలు. కానీ ఇప్పుడు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు వేలాది మంది.
వైరస్ జోన్లు..
చీటికి మాటికి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆసుపత్రుల్లోనే ఎక్కువగా వైరస్ ఉంటుందన్నది వాస్తవం. ఆసుపత్రులు ఉన్న పరిసరాల్లో కూడా వైరస్ ప్రభావం ఉంటుందన్నది నిజం. కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా లక్షణాలు వచ్చిరాగానే దవఖాన్లకు వెళ్లడం మాని హోం క్వారంటైన్ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లడం బెటర్.