దూకుడుకు మరో పేరు.. @ఇషాన్ కిషన్

by Anukaran |
Ishan Kishan
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాలో ఈ మధ్య దూకుడు కరువైంది. పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా మొదటి బంతి నుంచే చితకబాదే సెహ్వాగ్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్ జట్టులో లేకుండా పోయాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ వంటి క్రికెటర్లు ఉన్నా.. వీళ్లు ఈ మధ్య వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తొలి టీ20లో భారత జట్టు టాపార్డర్ 20 పరుగులకే డగౌట్‌లో కూర్చుంది. యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కనుక ఆ మ్యాచ్‌లో అర్ద సెంచరీ చేయకుంటే.. భారత జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. అసలు ఓపెనర్ అంటేనే దూకుడు ప్రదర్శించాలి. ధనాధన్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఆడాలి. అలాంటి బ్యాట్స్‌మాన్ ఇండియాకు దొరికేశాడు. అతనే ఇషాన్ కిషన్. అరంగేట్రం మ్యాచ్ అనే అనుమానమే రానీయకుండా తాను చేయాల్సిన పనేంటో చేసుకొని వెళ్లిపోయాడు. మొదటి బంతి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఇదంతా ఒక రాత్రే మారిపోయిన తలరాత కాదు. చిన్నప్పటి నుంచి జాతీయ జట్టుకు ఆడాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో తనను తాను మలుచుకున్న కిషన్ సాధించిన విజయం.

బీహార్లో పుట్టి జార్ఖండ్‌కు ఆడాడు..

బీహార్ రాజధాని పాట్నాలో ఇషాన్ కిషన్ పుట్టాడు. కిషన్ సోదరుడు ఇక్బాల్ హసన్ రిషు అతడిని క్రికెట్‌ను కెరీర్ గా చేసుకోమని చిన్నప్పటి నుంచే ప్రోత్సహించాడు. అయితే బీహార్ క్రికెట్ అసోసియేషన్‌తో వివాదం కారణంగా పక్క రాష్ట్రమైన జార్ఖండ్ తరపున ఆడటం మొదలుపెట్టాడు. 16 ఏళ్ళ వయసు నుంచే దేశవాళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన కిషన్.. 18 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ (273) చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో కూడా దూకుడుగా ఆడే కిషన్.. మంచి వికెట్ కీపర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. కిషన్ డబుల్ సెంచరీ చేసిన ఏడాదే అతడిని గుజరాత్ లయన్స్ తమ జట్టులోకి తీసుకున్నది. రెండేళ్ల పాటు ఆ జట్టుకు ఆడిన తర్వాత ముంబయి ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది. గత మూడు సీజన్లుగా ముంబయి జట్టుకు నమ్మకమైన ఓపెనర్‌గా కిషన్ ఉంటున్నాడు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబయి విజయంలో కిషన్ కూడా కీలక పాత్ర పోషించాడు. క్వింటన్ డీకాక్‌తో కలసి మంచి శుభారంభాలు అందించి ముంబయి జట్టును ఆదుకున్నాడు. దీంతో అతడు తప్పకుండా టీమ్ ఇండియాకు ఆడతాడని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. తొలి టీ20లో లేకపోయినా.. రెండో టీ20లో ముంబయి ఇండియన్స్ సహచర క్రికెటర్ అయిన సూర్యకుమార్‌తో కలసి అరంగేట్రం చేశాడు.

ఆ లోటును తీర్చేశాడు..

టీ20లో నెంబర్ వన్ జట్టు అయిన ఇంగ్లాండ్‌లో ప్రతీ బ్యాట్స్‌మాన్ ఎటాకింగ్ చేస్తుంటారు. వికెట్లు పడినా వారి దూకుడు మాత్రం ఆపరు. గత రెండు టీ20లు చూస్తే.. జేసన్ రాయ్ ఆడిన విధానం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. అతడు మాత్రం తన సహజమైన దూకుడుతో పరుగులు తెచ్చాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో మూడు సార్లు రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ జేసన్ రాయ్ ఆ షాట్‌ను ఆడటం మానేయ్యలేదు. ఆ తర్వాత రెండు రివర్స్ స్వీప్ షాట్లతో బౌండరీలు సాధించాడు. టీమ్ ఇండియాలో ఇలా ఆడగలిగే బ్యాట్స్‌మాన్ కరువయ్యాడు. కానీ ఇషాన్ కిషన్ రాకతో ఆ లోటు తీరిపోయింది. మొదటి బంతి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 28 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేసిన ఇషాన్ కిషన్.. మొత్తం 32 బంతులు ఆడాడు. వీటిలో కేవలం రెండు మాత్రమే ‘డిఫెన్స్’ షాట్లు అంటే అతడి ఆట తీరు, మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇషాన్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మాన్‌గా స్థిరపడిపోయే అవకాశాలు ఉన్నాయి.

‘ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడమ్ గిల్‌క్రిస్ట్, ఎంఎస్ ధోనీ తనకు ఆదర్శమని చెబుతాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లే కావడం గమనార్హం. అందులో జార్ఖండ్ డైనమైట్ అని ధోనీని పిలుస్తారు. ఆదివారం ఇషాన్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు జార్ఖండ్ నయా డైనమైట్ అని పిలుస్తున్నాడు. రిషబ్ పంత్ కనుక టెస్ట్ మ్యాచ్‌లకు కీపర్‌గా వ్యవహరిస్తే.. కిషన్‌ను పరిమిత ఓవర్లలో కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నది’

కిషన్ కెరీర్..

ఇషాన్ కిషన్, తండ్రి పేరు : తుషార్ కాంతి గోష్
జన్మస్థలం : పట్నా, బీహార్
ఆడిన జట్లు : జార్ఖండ్, గుజరాత్ లయన్స్, ముంబయి ఇండియన్స్, టీమ్ ఇండియా
జాతీయ జట్టు క్యాప్ నెంబర్ : 84
ఫస్ట్ క్లాస్ క్రికెట్
44 మ్యాచ్‌లు, 2665 పరుగులు, 5 సెంచరీలు, 90 క్యాచ్‌లు, 11 స్టంపింగ్స్, అత్యధిక పరుగులు 273
లిస్ట్ ఏ కెరీర్
73 మ్యాచ్‌లు, 2507 పరుగులు, 4 సెంచరీలు, 87 క్యాచ్‌లు, 7 స్టంపింగ్స్, అత్యధిక పరుగులు 173
టీ20 కెరీర్
90 మ్యాచ్‌లు, 2230 పరుగులు, 2 సెంచరీలు, 44 క్యాచ్‌లు, 7 స్టంపింగ్స్, అత్యధిక పరుగులు 113

Advertisement

Next Story