ఇంత నిర్లక్ష్యమా..! పోలీస్ కమిషనర్ అంత బిజీనా?

by Shyam |
high court copy
X

దిశ, తెలంగాణ బ్యూరో : వినాయక నిమజ్జనం విషయంలో ప్రభుత్వం నుంచి తగిన స్పందన కరువైందని అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. గత విచారణ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా నివేదిక ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి, మరోవైపు కాలుష్యం ఉన్న పరిస్థితుల్లో గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వ వైఖరేంటని ప్రశ్నించింది. ఈ అంశంపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినా ఇప్పటికీ ఇవ్వలేదని, జీహెచ్ఎంసీ సమర్పించినా విచారణకు పది నిమిషాల ముందు ఇచ్చిందని అసహనం వ్యక్తం చేసింది. గణేశ్ నిమజ్జనం ద్వారా హుస్సేన్ సాగర్ జలాలు కలుషితమవుతున్నాయంటూ ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎంఎస్ రాంచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది.

నివేదిక సమర్పించకపోవడాన్ని ప్రభుత్వానికి శ్రద్ధలేదని భావించాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు కనీసం నివేదిక ఇచ్చేంత తీరిక కూడా లేదా అని ప్రశ్నించింది. నిమజ్జనం విషయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని, అయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించింది. నిమజ్జనం సందర్భంగా జనం గుమికూడకుండా ఏం చర్యలు తీసుకోనున్నదీ ప్రభుత్వం చెప్పడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 48 చెరువులు, కుంటలు, కొలనులలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కాలుష్యాన్ని నివారించడానికి మట్టి గణపతిలను మాత్రమే పూజించాలంటూ ప్రజలకు పిలుపునివ్వడంతో పాటు ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ తరఫున లక్ష ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిని సావధానంగా విన్న హైకోర్టు బెంచ్, ఇప్పుడు కావాల్సింది సలహాలు, వివరణలు కాదని, స్పష్టమైన మార్గదర్శకాలు అని వ్యాఖ్యానించింది. కాలుష్యం మొత్తం వాతావరణం, పర్యావరణం మీదనే ఎలాంటి ప్రభావం చూపుతున్నదో, ఎలాంటి మార్పులకు కారణమవుతున్నదో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నామంటూ గుర్తుచేసింది.

గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా చెప్పకపోవడం, నివేదికను సమర్పించకపోవడంతో చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్నదని, ఇకపైన హైకోర్టే తగిన ఆదేశాలను జారీ చేస్తుందని వ్యాఖ్యానించి ప్రభుత్వ ఉత్తర్వులను రిజర్వు చేసింది.

Advertisement

Next Story

Most Viewed