దేశంలో ఏకఛత్రాధిపత్యమే బీజేపీ ధ్యేయమా! దానికోసం ఏం చేస్తుంది?

by Ravi |   ( Updated:2022-09-03 13:29:39.0  )
దేశంలో ఏకఛత్రాధిపత్యమే బీజేపీ ధ్యేయమా! దానికోసం ఏం చేస్తుంది?
X

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్, పార్టీ నుంచి సస్పెన్షన్, బండి సంజయ్ అరెస్ట్ హైడ్రామా కొనసాగుతున్నది. తురుపు ముక్క దొరికినట్టు బీజేపీ నేతలు హంగామా చేసేస్తున్నారు. తమ వెంట రానివారిని కేసులలో ఇరికించే రాజకీయం నిస్సిగ్గుగా నడుస్తున్నది. బిల్కిస్ బానో కేసులో 11 మందిని విడుదల చేసిన విషయంలో మహిళలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మొహువా మొయిత్ర, సామాజిక కార్యకర్త 80 యేండ్ల రూప్ రేఖా రాణి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. ఇంత జరుగుతున్నా పీఎం నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా మౌనం వీడడం లేదు. దేశంలో చరమ స్థాయికి చేరిన నిరుద్యోగం, అధిక ధరలు, అసమానతలు, అప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చి తమ పబ్బం గడుపుకోవడానికే బీజేపీ ఆడుతున్న నాటకంలా ఇది కనిపించడం లేదా?

భారత రాజధాని ఢిల్లీ లాల్ ఖిలా నుంచి పంద్రాగస్టు నాడు మహిళల గౌరవం గురించి పీఎం నరేంద్ర మోదీ మాట్లాడుతూ వారి పట్ల అవమానకర సంఘటనల విషయంలో ఆవేదన వ్యక్తం చేసారు. మహిళల విషయంలో అగౌరవంగా ఉండేవారి పట్ల కఠినంగా ఉంటామన్నారు. అదే సందర్భంలో బిల్కిస్ బానో కేసులోని 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. విశ్వహిందూ పరిషత్ నేతలు వారిని పూల దండలు వేసి సన్మానించారు. గతంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాగే రేప్ అండ్ మర్డర్ కేసులలో జైలులో ఉన్న డేరా బాబాను పెరోల్ మీద మీద విడుదల చేసి సకల సౌకర్యాలు కల్పించారు. విమర్శలు రావడంతో తిరిగి జైలుకు పంపారు.

బిల్కిస్ బానో ఊరు ఇప్పుడు భయం గుప్పిట ఉంది. దాదాపు 500 మంది ఆ ఊరు ఖాళీ చేసి ఇండ్లకు తాళాలు వేసి ఎటో వెళ్లిపోయారు. బిల్కీస్ చిన్నాన్న యాకుబ్ మాట్లాడుతూ 'మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం' అన్నాడు. గుజరాత్ గోద్రా సమీపంలో గల ఒక వాడలాంటి ఈ గ్రామాన్ని ఆనుకుని పోలీస్ స్టేషన్ ఉన్నా తాము మైనారిటీలం కాబట్టి రక్షణ, గ్యారంటీ లేదని, అందుకే కూలి పనులను కూడా వదిలేసి పోతున్నామని అంటున్నారు. ఆ 11 మంది ఇంతకు ముందు పెరోల్ మీద కూడా వచ్చి జైలుకు వెళ్లిపోయారు. ఈ సారి ప్రభుత్వం మొత్తానికే విడుదల చేసింది. అందుకే భయం అంటున్నారు. డీజేలతో వారికి స్వాగతం పలుకుతున్నారంటే తమలో భయం సృష్టించచడానికేనని చెబుతున్నారు.

అంతా రాజకీయాల కోసమే

దేశంలో పాలిటిక్స్ మాత్రమే ప్రధానం అయిపోయాయి. బిహార్‌లోని పాట్నాలో నిరుద్యోగుల మీద లాఠీలు కరాళ నృత్యం చేశాయి. పోలీస్ దెబ్బలు తట్టుకోలేక ఒకరు జాతీయ జెండా కప్పుకుంటే, జెండా మీది నుంచే ఒక అధికారి అతన్ని రక్తం కారే దాకా కొట్టారు. పలు రాష్ట్రాలలో ఈ ఎనిమిది యేండ్లలో విద్యార్థుల, నిరుద్యోగుల ఆందోళనలు, ప్రదర్శనలు 166 వరకు జరుగగా 130 ఆందోళనల మీద లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్, గాలిలో కాల్పులు, నేరుగా కాల్పులు జరిగాయి. అరెస్టులు కూడా భారీగానే జరిగాయి. ఆత్మహత్యలు పెరిగాయి. ఉన్నత విద్య కోసం యేటా ఆరు లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పోతున్నారు. ఎంప్లాయిమెంట్ రిజిస్టర్డ్ నిరుద్యోగులు 11 కోట్ల మంది ఉండగా, ఇందులో యూపీలో 1 కోటి 30 లక్షలు, బిహార్‌లో కోటి మంది ఉన్నారు. ఇవన్నీ ఏమీ పట్టవు.

పాలిటిక్స్‌ను పెంచి పోషించడం కోసం కార్పొరేట్‌లకు మేలు చేయడం, అవసరం అయితే ఎన్‌డీ‌టీవీ లాంటి జాతీయస్థాయి చానల్‌ను దాని ఫౌండర్స్ ప్రణయ్‌రాయ్, రాధికారాయ్‌కు తెలియకుండా గౌతమ్ అదానీకి ధారాదత్తం చేయడం జరుగుతుంది. తమ ఏకఛత్రాధిపత్యం కొనసాగించడం కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ యుద్ధం మొదలైంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. సీబీఐ దాడులు జరిగాయి. రెండేండ్ల క్రితం ఢిల్లీ ప్రభుత్వం కొనుగోలు చేసిన వెయ్యి బస్సులకు సంబంధించి కూడా విచారణ ప్రారంభం అయింది అంటున్నారు. ఓ ఆప్ మంత్రి జైలులో ఉన్నారు. సిసోడియా ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మహారాష్ట్రలో మాదిరి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చితే ఏ కేసు ఉండదని, సీఎంను చేస్తామని తనకు మెసేజ్ వచ్చిందని సిసోడియా బాంబు పేల్చారు. తాను భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు.

బెదిరించి, లొంగదీసుకుని

దేశానికే ఆదర్శం అయ్యే విధంగా ఢిల్లీ విద్యా వ్యవస్థను తీర్చి దిద్దిన సిసోడియాను భారతరత్న అవార్డుతో గౌరవించాల్సింది పోయి, సీబీఐ కేసులు పెట్టడం దారుణం అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. దేశం క్లిష్ట సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న సమయంలో విపక్షాలను పిలిచి గట్టెక్కే ఆలోచన చేయాల్సిన సమయంలో సీబీఐ, ఈడీలాంటి ఏజెన్సీలతో బెదిరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏదో ఒక రకంగా ప్రభుత్వాలను పడగొట్టడం, డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం ఇవ్వడం షరా మాములు అయిపోయింది.

మహారాష్ట్రలో సగం కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవినీతి కేసులలో ఉన్నారు. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోడానికి అదే కారణమైంది. ఢిల్లీలో ఆప్ ఒంటరి‌గానే బీజేపీని ఎదుర్కొంటున్నది. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, గుజరాత్‌లో ఎన్నికలు జరుగనుండడంతో కాంగ్రెస్ కన్నా తమకు ఆప్‌తోనే ముప్పు అని గమనించిన బీజేపీ ఆ పార్టీ ముఖ్య నేతల వెంటపడింది. బిహార్ పరిణామలతో ఖంగు తిన్న బీజేపీ అక్కడ కూడా కేసులను తవ్వి ఆర్‌‌జే‌డీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తున్నది. డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ పాత కేసులను తెర మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది.

బీజేపీ నేతల హంగామా

కేంద్ర హోమ్ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టేని మీద ఉన్న మర్డర్ కేసు వాయిదా పడుతోంది. వాహనాలతో ఢీకొట్టి నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ మరణానికి కారణం అయిన ఆయన తనయుడు జైలులో ఉన్నాడు. మంత్రిని కూడా భర్తరఫ్ చేసి, అరెస్ట్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు నేత రాకేష్ టికాయత్‌ను మంత్రి అజయ్ మిశ్రా 'రెండణాల మనిషి' అని వ్యాఖ్యానించడాన్ని రైతాంగం నిరసిస్తున్నది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా వంతు అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ వెంట పడ్డారు.

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్, పార్టీ నుంచి సస్పెన్షన్, బండి సంజయ్ అరెస్ట్ హైడ్రామా కొనసాగుతున్నది. తురుపు ముక్క దొరికినట్టు బీజేపీ నేతలు హంగామా చేసేస్తున్నారు. తమ వెంట రానివారి కేసులలో ఇరికించే రాజకీయం నిస్సిగ్గుగా నడుస్తున్నది. బిల్కిస్ బానో కేసులో 11 మందిని విడుదల చేసిన విషయంలో మహిళలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మొహువా మొయిత్ర, సామాజిక కార్యకర్త 80 యేండ్ల రూప్ రేఖా రాణి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. ఇంత జరుగుతున్నా పీఎం నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా మౌనం వీడడం లేదు. దేశంలో చరమస్థాయికి చేరిన నిరుద్యోగం, అధిక ధరలు, అసమానతలు, అప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చి తమ పబ్బం గడుపుకోవడానికే బీజేపీ ఆడుతున్న నాటకంలా ఇది కనిపించడం లేదా?

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Advertisement

Next Story