ఇసుక క్వారీల్లో అక్రమాలకు అడ్డేది..?

by Sridhar Babu |
ఇసుక క్వారీల్లో అక్రమాలకు అడ్డేది..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అసలే అటవీ ప్రాంతం ఆపై అంతర్రాష్ట్ర రహదారి.. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఆ గోదావరి తీరంలోనే ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఏర్పాటు చేసిన ఈ క్వారీల నుండి ఇసుక తరలించేందుకు నిత్యం వేలాది లారీలు తిరుగుతూనే ఉంటాయి.

దీంతో సామాన్యులు అక్కడి రహదారులపైకి వచ్చేందుకే జంకుతున్నారు. అంతేకాకుండా ఇసుక లారీల ప్రమాదాల కారణంగా కొంతమంది మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికులు ఆందోళనలు చేపట్టడంతో ఈ ప్రాంత పోలీసులు చొరవ తీసుకుని పరిష్కారం చూపారు. దీంతో సామాన్య జనంతో పాటు విద్యార్థులు తిరిగే సమయాల్లో ఇసుక లారీలు నడపొద్దని నిర్ణయించారు. ఈ మేరకు క్వారీల యజమానులకు చెప్పడంతో పాటు ప్రధాన రహదారులపై రోడ్ స్టాపర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇసుక లారీల ద్వారా జరిగే ప్రమాదాలను నిలువరించగలిగారు.

పార్కింగ్ స్థలాలు ఏవీ..?

మహదేవపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ క్వారీల నుండి ఇసుకను తరలించే లారీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు లేకపోవడం ఆ ప్రాంత వాసులకు ప్రధాన సమస్యగా మారింది. రద్దీగా ఉండే సమయంలో వాహనాలకు అనుమతి ఇవ్వకున్నా పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్ల వరకు లారీలను తీసుకొచ్చి నిలుపుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ఇసుక లారీలను పార్కింక్ చేయిస్తున్నారు. వాస్తవంగా ఈ బాధ్యతలను ఇసుక క్వారీ నిర్వహకులు కానీ టీఎస్ ఎండీసీ కాని తీసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ కోసం దృష్టి సారించిన టీఎస్ఎండీసీ ఇసుక లారీల పార్కింగ్ స్థలాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాకుండా పోయింది.

రికార్డుల్లో లీజుకు..

వాస్తవంగా పార్కింగ్ స్థలాల కోసం క్వారీ నిర్వహకులు ప్రత్యేకంగా స్థలాన్ని లీజు తీసుకున్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ అక్కడ మాత్రం లారీలను పార్క్ చేయించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కింగ్ స్థలాలను కూడా స్టాక్ యార్డులుగా మార్చుకుని ఇసుకను నిలువ చేసుకుంటున్నారు. క్వారీలకు వచ్చి వెళ్లే లారీలను మాత్రం ఆ స్థలాల్లో పార్కింగ్ చేయించడం లేదు. దీంతో ఇసుక తరలించే లారీల కోసం ప్రత్యేకంగా పోలీసులు స్థలాలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి తయారైంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలో పోలీసులే ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఇసుక లారీల కోసం పార్కింగ్ స్థలాన్ని చూపించాల్సి వచ్చింది. క్వారీ నిర్వహకులే లారీల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తే వాటికి కెటాయించిన సమయంలో రోడ్లపైకి వెల్లే అవకాశం ఉంటుంది కదా అని స్థానికులు అంటున్నారు.

మొక్కుబడిగానే..

చాలా వరకు క్వారీల నిర్వాహకులు తీసుకున్న పార్కింగ్ స్థలాలు లారీలను నిలిపేందుకు వినియోగించకపోవడం విడ్డూరం. క్వారీలకు వచ్చే లారీల సంఖ్యను బట్టి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా క్వారీలకు వచ్చే లారీల సగటును లెక్కించి అందుకు తగ్గట్టుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నది వాస్తవం. కానీ, చాలా చోట్ల నామమాత్రంగా పార్కింగ్ స్థలాల కోసం లీజు తీసుకుంటున్నట్లుగా రికార్డులు చూపించి మొక్కుబడి తంతును కొనసాగిస్తున్నారని స్థానికులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed