రేపు గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

by Shyam |   ( Updated:2020-08-01 08:13:07.0  )
రేపు గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సెప్టెంబర్ 19నుంచి యూఏఈలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటన వెలువడింది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఈ మెగా లీగ్‌ను ఎలాగైనా నిర్వహించాలనుకున్న బీసీసీఐ తన పంతం నెగ్గించుకోబోతున్నది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బయో బబుల్ సృష్టించి లీగ్ నిర్వహించాల్సి ఉన్నందున, ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీ) తయారు చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ షెడ్యూల్ పూర్తిగా రూపొందించడం, ప్రభుత్వ అనుమతులు కోరడంతోపాటు ఇతర విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇవన్నీ ఆదివారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రానున్నాయి. మరోవైపు బీసీసీఐ ఇంకా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)కి అధికారికంగా లేఖ పంపకపోవడంతో ఈసీబీ కూడా అక్కడి ప్రభుత్వానికి అనుమతుల కోసం లేఖలు రాయలేదు.

గవర్నింగ్ కౌన్సిల్స్ జరిగేనా?

ఐపీఎల్ యూఏఈలో జరుగుతుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఐపీఎల్ జీసీ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కూడా ఐపీఎల్ నిర్వహిస్తామని చెప్పినా.. పూర్తి వివరాలు మాత్రం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాతే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అయితే, టీ20 వరల్డ్ కప్‌ను రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించిన వెంటనే ఐపీఎల్ విదేశంలో నిర్వహించడానికి అనుమతులు కోరుతూ బీసీసీఐ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికీ 10రోజులు దాటినా కేంద్రంలోని పలు శాఖల నుంచి అనుమతులు రాలేదు. ప్రభుత్వ అనుమతులు వస్తేనే ఐపీఎల్‌పై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండటంతో ఆదివారం నాటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు అధికారికంగా లేఖ ఇవ్వాలంటే భారత ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి.

ఎస్‌వోపీనే ప్రధానం..

భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఆ సమావేశంలో ప్రధాన చర్చ ఎస్‌వోపీ మీదనే జరగనున్నది. ఇండియా, విదేశాల నుంచి ఆటగాళ్లను యూఏఈ చేర్చడం, అక్కడి నుంచి బయోబబుల్‌లో ఆటగాళ్లకు ఎలాంటి నిబంధనలు ఉంటాయో తెలియజేయడం ఐపీఎల్ యాజమాన్యం ప్రధాన బాధ్యత. ఎంతమంది ఆటగాళ్లను యూఏఈ తీసుకెళ్లాలి? సీజన్ మధ్యలో ఆటగాడు కరోనా బారిన పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా జీసీ సమావేశంలోనే నిర్ణయించనున్నారు. అయితే స్టేడియంతోపాటు ఆటగాళ్లు బసచేసే ప్రదేశాలన్నింటినీ ఒకే బయోబబుల్‌లో ఉంచడం కష్టం. కాబట్టి ఐపీఎల్ కోసం ఎలాంటి బయోసెక్యూర్ వాతావరణం సృష్టించాలనే చర్చ కూడా జరగనుంది.

అనుమతులు లభిస్తాయని భావిస్తున్నాం

‘ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయనే భావిస్తున్నాము. కాకపోతే కొంచెం ఆలస్యం కావొచ్చు. అనుమతుల విషయంపై స్పష్టత రాకపోయినా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నిరకాలుగా బీసీసీఐ సిద్ధంగా ఉంది. అనుమతులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి’ అంటూ బీసీసీఐలోని ఓ అధికారి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed