ఆట యూఏఈలో.. ఇంటిలో కామెంటేటర్లు

by Shyam |
ఆట యూఏఈలో.. ఇంటిలో కామెంటేటర్లు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ గ్రూప్ ఏర్పాట్లను ప్రారంభించింది. కొవిడ్-19 నేపథ్యంలో ఈసారి కొన్ని ప్రయోగాలు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల దక్షిణాఫ్రికాలో నిర్వహించిన 3టీ కప్‌ను స్టార్‌స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఆట సెంచూరియన్‌లో జరుగుతున్నా కామెంటేటర్లు మాత్రం వర్చువల్‌ రూమ్స్‌లో ఉండి వ్యాఖ్యానం అందించారు. బరోడా నుంచి ఇర్ఫాన్ పఠాన్, కోల్‌కతా నుంచి దీప్‌దాస్ గుప్తా, ముంబయిలోని తన ఇంటి నుంచి సంజయ్ మంజ్రేకర్ కామెంట్రీ అందించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను స్టార్ స్పోర్ట్స్ చేసింది. ‘వర్చువల్ కామెంట్రీ’గా పిలుచుకొనే ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఐపీఎల్‌కు కూడా ఇదే అమలు చేయాలని చూస్తున్నది. పదుల సంఖ్యలో కామెంటేటర్లను యూఏఈ తీసుకెళ్లడం, అదే సమయంలో వారికి వసతి ఏర్పాటు చేయడం ప్రస్తుతం కష్టమే. స్టార్ గ్రూప్ ఆంగ్లం, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కామెంటరీ అందిస్తున్నది. ఆంగ్ల వ్యాఖ్యాతలను యూఏఈ తీసుకెళ్లినా హిందీ, తెలుగు, తమిళ కామెంట్రీకి మాత్రం వర్చువల్ పద్ధతిని అమలు చేయాలని భావిస్తున్నది. ఐపీఎల్ వంటి పవర్ ప్యాకింగ్ లీగ్‌కు వర్చువల్ కామెంట్రీ చాలా సవాళ్లతో కూడుకున్నది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అమలుచేయక తప్పదని స్టార్ చెబుతున్నది. మరోవైపు ఈ వర్చువల్ విధానానికి కామెంటేటర్లు కూడా పచ్చజెండా ఊపుతున్నారు. ‘మేం కూడా వర్క్ ఫ్రం హోం చేస్తామని కలలో కూడా ఊహించలేదు. 3టీ క్రికెట్‌కు ఇంట్లో కూర్చుని కామెంట్రీ చెప్పడం గొప్ప అనుభూతిని కలిగించింది’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed