నిఘా అక్కడ నిద్రపోతోందా?

by Aamani |
నిఘా అక్కడ నిద్రపోతోందా?
X

దిశ, ఆదిలాబాద్:
నిర్మల్ జిల్లాలో మర్కజ్ సభకు వెళ్లొచ్చిన వారు క్వారంటైన్‌కు వెళ్లకుండా జిల్లాలో తిరుగుతున్నారనే వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. కేంద్రం హెచ్చరించే దాకా కొంతమంది ఢిల్లీతో పాటు, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన సమాచారం ఇక్కడి నిఘా వర్గాలకు తెలియకపోవడం కలవరపెడుతున్నది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇక్కడి ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్‌గానే కనిపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) ప్రభావం మొదలైన నుంచి అన్ని శాఖలు ప్రధానంగా ఇంటెలిజెన్స్ శాఖపైనే ఆధారపడుతున్నాయి. రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖలు ప్రతి విషయంలోనూ ఇంటలిజెన్స్ సమాచారం పైనే ఆధారపడి పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ముగ్గురు వ్యక్తులు ఢిల్లీ మర్కజ్, ఉత్తర‌ప్రదేశ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చి సమాచారం గోప్యంగా ఉంచడం, ఆ తర్వాత ఢిల్లీ నిఘా వర్గాలు హెచ్చరించడంతో వారిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. మొత్తం ఏడుగురు నిర్మల్ జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.
దీంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఢిల్లీ ప్రాంతం‌లోకి వెళ్లి వచ్చిన ముగ్గురిపై కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. ఈ ముగ్గురు 15 రోజుల కిందటే ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పోలీసుల కళ్లు గప్పి జనంలో తిరుగుతున్నారు. అక్కడికి వెళ్లి వచ్చిన విషయాన్ని వారు దాచిపెట్టారు. చివరకు ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల తర్వాత ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మత పెద్దగా భావించే వ్యక్తి ఉండటం గమనార్హం. అదుపులోకి తీసుకున్న తర్వాత ముగ్గురిలో శాంపిళ్లను పరీక్షిస్తే ఇద్దరికి కొవిడ్ 19 పాజిటివ్ రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.

పాజిటివ్ వచ్చిన వ్యక్తి మత పెద్ద గానే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి. ఈ క్రమంలో ఆయన 15 రోజులుగా ప్రజల్లో ఉంటూనే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. చివరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్‌కు కూడా పలుసార్లు వచ్చినట్టు పలువురు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులతో ఆయన తిరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. స్థానిక ప్రముఖులను పాజిటివ్ వచ్చిన వ్యక్తి కలిశాడని ప్రచారం జరుగుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సోషల్ వెల్ఫేర్ పాఠశాల, మహిళా ప్రాంగణం సెంటర్లకు తమ ప్రతినిధులతో కలిసి వెళ్లాడని ఇప్పుడు అధికారులు అంగీకరిస్తున్నారు.

ఎందరిని కలిశాడో..

నిర్మల్ జిల్లా కేంద్ర జనం ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ఎందరో ప్రముఖులను కలిసిన ఆ వ్యక్తి పట్టణంలోని పలు సామాజిక వర్గాలను కలిశాడని తెలుస్తోంది. ఆ వ్యక్తి విద్యావంతుడు కావడమే గాక, తన మతంలో మంచి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అయి ఉండి ఇలా ప్రవర్తించడం సబబేనా ? అని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఇచ్చే సమాచారం బట్టి పట్టణంలో అనేకమందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితికి ఇక్కడి ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా లోపమేనని విమర్శలొస్తున్నాయి.

ఇప్పటికే ఆ వ్యక్తి(మతపెద్ద) కుటుంబీకులను ఆయనతో పాటే వచ్చిన మరో పాజిటివ్ వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అలాగే గత పక్షం రోజులుగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురిని కూడా యంత్రాంగం అదుపులోకి తీసుకొని పరీక్షల కోసం క్వారంటైన్‌కు తరలించారు. వీరి పరీక్షల రిపోర్టుల అనంతరం ఎంత మందికి కొవిడ్ ప్రబలింది? అసలేం జరిగిందన్నది బయటపడనుంది. దీనిపై ఇక్కడి ఇంటలిజెన్స్ అధికారులు లోతుగా విచారణ మొదలుపెట్టారు.

Tags: Intelligence Alert, covid 19, markaz meeting, cases

Advertisement

Next Story