- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది పరీక్షలపై హైకోర్టు తీర్పు ఏంటి?
దిశ, న్యూస్ బ్యూరో: పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ పరీక్షల నిర్వహణకు అవసరమైనంత సంఖ్యలో ఉపాధ్యాయులు (ఇన్విజిలేటర్లు) దొరకకపోవడం, కంటైన్‌మెంట్ జోన్లలో చాలా మంది విద్యార్థులు హాజరుకావడంలో ఉన్న ఇబ్బందులతో పరీక్షలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు యధావిధిగా నిర్వహించగలుగుతామని స్పష్టం చేసింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం జరిగిన విచారణ కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే వివరణ ఆధారంగా వాటి నిర్వహణపై శనివారం స్పష్టత రానుంది. విచారణ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. కరోనా కారణంగా కంటైన్‌మెంట్ జోన్లలో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నందున ఆ ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్షలకు ఎలా హాజరవుతారని ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్ ప్రసాద్‌ను హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. రాష్ట్రంలో మొత్తం ఎన్ని కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయో, ఎంత మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరుకావడంలో ఇబ్బందులు వుంటాయో పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా ఆదేశించడంతో శనివారం సమర్పిస్తామని ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గడువు కోరారు. దీనికి కోర్టు అనుమతించడంతో ప్రభుత్వం ఇచ్చే వివరణ ఆధారంగా పరీక్షలపై స్పష్టత రానుంది.
కంటైన్‌మెంట్ జోన్లలో ఉండే విద్యార్థులు ఇప్పుడు పరీక్షలకు హాజరుకాలేకపోతే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని హైకోర్టుకు ప్రసాద్ వివరించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులను రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత దీనిపై స్పష్టత ఇవ్వగలుగుతామని ప్రసాద్ బదులిచ్చారు. కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ అనివార్యం కావడంతో పరీక్షా కేంద్రాల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇన్విజిలేటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. కానీ లాక్‌డౌన్ కారణంగా చాలా ప్రైవేటు విద్యా సంస్థలు వారి ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఎంతమంది హాజరవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కూడా అడ్వొకేట్ జనరల్ శనివారం సమర్పించే వివరాల్లో స్పష్టత ఇవ్వనున్నారు. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నందున శనివారం హైకోర్టు వెలువరించే ఉత్తర్వులతో సస్పెన్స్‌కు తెరపడనుంది.