- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాతలకు తీవ్ర అన్యాయం.. అధికారుల మౌనం దేనికి సంకేతం.?
దిశ, నర్సంపేట : నియోజకవర్గంలోని ఓ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం)లో చేపట్టిన మక్కల రవాణా వ్యవహారంలో అవినీతి బయటపడింది. ఈ ఘటన జరిగి నేటికి తొమ్మిది నెలలు గడుస్తున్నా అక్రమార్కులపై చర్యలకు అధికార యంత్రాంగం వెనకడుగు వేస్తోంది. రైతు పక్షపాతి అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఇన్ని నెలలు గడుస్తున్నా కనీసం పట్టించుకునే వారే కరువయ్యాడు. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతులను కొనుగోలు కేంద్రం వేదికగానే కొందరు అవినీతిపరులు నట్టేట ముంచుతున్నారు.
రైతులకు ప్రభుత్వం చెల్లించిన రవాణా డబ్బుల్ని కుల్లగుత్తగా కొల్లగొడుతూ రైతులకు ఎగనామం పెడుతున్నారు. బాధిత రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు కాస్తా.. అవినీతిపరుల కొమ్ముకాస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదు మాత్రమే కాకుండా ఆధారాలు సైతం చూపెట్టినా నేటికీ అక్రమాలకు పాల్పడిన వారిపై నేటికీ చర్యల్లేవు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వ్యవసాయ శాఖ, సహకార శాఖ కమిషనర్‌లకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది..
నర్సంపేట నియోజకవర్గంలోని 28 పీఎస్‌సీఎస్ కేంద్రాల్లో గతేడాది మక్కల కొనుగోళ్లు చేపట్టారు. కొనుగోలు అనంతరం రవాణా ఖర్చుల్ని పంట వేసిన రైతుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేశారు. అనంతరం ప్రభుత్వం రైతులకు రవాణా ఖర్చుల్ని చెల్లించాలని అదేశించి సంబంధిత నగదును మంజూరు చేసింది. ఇది గడిచి నెలలు కావస్తున్నా సంబంధిత రైతులకు నయాపైసా అందలేదు. ఈ విషయంపై బాధిత రైతులు జిల్లా సహకార అధికారికి మొర పెట్టుకోగా ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ నాగ నారాయణను నియమించింది.
క్షేత్ర స్థాయిలో విచారణ చేసిన నారాయణ అసలు విషయం గుర్తించాడు. ప్రభుత్వం రైతులకు రూ. 4,22,000 చెల్లించిందని, కానీ అది రైతుల ఖాతాల్లో జమ కాలేదని తేలింది. దీనికి పీఎస్‌సీఎస్ మహమ్మదాపురం కేంద్రమే కారణమని, ఇక్కడ రైతుల డబ్బులు దుర్వినియోగం అయ్యాయని ఈ ఏడాది మార్చి నెలలో నివేదిక అందించారు. ఇది గడిచి నేటికి తొమ్మిది నెలలు అవుతున్నా అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ వైపుగా కూడా అధికార యంత్రాంగం సాహసించట్లేదు.
సీఎస్ గారు మీరే ఆదుకోవాలి..
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా, రైతన్నల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతున్నామని సభలు, సమావేశాల సందర్భంగా చెప్తున్న సంగతి తెల్సిందే. కాగా అవినీతి పాల్పడిన వారిపై విచారణ అధికారి నివేదిక సమర్పించి నేటికి ఎనిమిది నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కలెక్టర్, డీసీఓ వ్యవహరించడం దేనికి సంకేతం. అసలే ఆర్థికంగా చితికిపోయిన రైతుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చాలా ఆక్షేపినీయం. ఇప్పటికైనా ఈ సమస్యపై దృష్టి సారించి అవినీతికి పాల్పడిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొని, రైతులకు న్యాయం చేసి ప్రజాస్వామ్య విలువలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నదాతలు, స్థానిక నేతలు కోరుతున్నారు.
పీఏసీఎస్ కేంద్రంలో మక్కల రవాణా డబ్బులు కాజేశారు. ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదు. ఇక్కడ అవినీతి జరిగిందని విచారణ అధికారి నివేదిక ఇచ్చినప్పటికీ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. అక్రమం జరిగిందని బయటపెట్టిన వారే ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. అవినీతికి పాల్పడిన వారు బయట దర్జాగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతుంటే, అవినీతిని ప్రశ్నించి, నిరూపించినవారు ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ కాళ్లరిగేలా ప్రదిక్షణలు చేసే పరిస్థితి దాపురించింది.
పాలడుగుల జీవన్,
పీఏసీఎస్ వైస్ చైర్మన్-మహ్మదాపురం.