లాక్‌డౌన్… కూలీల ప్రాణం తీసింది!

by vinod kumar |   ( Updated:2020-05-08 04:12:48.0  )
లాక్‌డౌన్… కూలీల ప్రాణం తీసింది!
X

దిశ, వెబ్‌డెస్క్: పాపం.. వాళ్లకేం తెలియదు… ప్రభుత్వం తమను ఇంటికి చేర్చడానికి పెట్టిన శ్రామిక్ రైలు ఎక్కి ఇవాళ సాయంత్రానికి ఇంటికి చేరతామనుకున్నారు. ఇప్పటికి 45 కి.మీ.లు నడిచాం.. ఇంకొద్ది దూరం నడిస్తే, రైలెక్కి సొంత ఇంటికి వెళ్లొచ్చు అనుకున్నారు. కానీ శరీరం సహకరించలేదు. అలసట మొహాన కమ్ముకుంది. ఇంతసేపు నడిచాం కదా.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. ఉండటానికి హోటళ్లు లేవు, ఉన్నా అందులో ఉండే స్తోమత లేదు. ఎవరింటికైనా వెళ్దామా అంటే కరోనా భయంతో ఎవరూ రానిచ్చే పరిస్థితి లేదు. ఇక రైలు పట్టాలే దిక్కయ్యాయి. ఎలాగూ లాక్‌డౌన్… ఏ రైళ్లు రావనుకున్నారు. వాటి మీదే నిద్రించారు. కానీ దురదృష్టం వారు ఎదురుచూస్తున్న రైలు రూపంలోనే వచ్చి, ప్రాణాలను కబళించింది. అది సృష్టించిన ఘోరానికి ఎవరి శరీర భాగం ఎవరిదో తెలుసుకోలేనంత పరిస్థితి ఏర్పడింది.

20 మంది వలస కూలీలు తమ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌కి వెళ్లడానికి శ్రామిక్ స్పెషల్ ట్రైన్ కోసం జల్నా నుంచి భుసావల్ వెళ్తున్నారు. ఇది మొత్తం 150 కి.మీ.లు ఉంటుంది. అప్పటికే వారు 45 కి.మీ.లు నడిచారు. అలసటతో ట్రాక్ మీదనే నిద్రపోయారు. ఉదయం 5.15 గం.లకు హైద్రాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి పనేవాడి స్టేషన్‌కి వెళ్తున్న గూడ్స్ రైలు వారిలో 14 మంది ప్రాణాలను కబళించింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని దూరం నుంచే కనిపెట్టిన లోకోపైలట్ రైలు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ప్రమాదాన్ని జరగకుండా ఆపలేకపోయాడని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

ప్రధాన కారణం లాక్‌డౌన్?

పైన వివరించిన సంఘటనలో ప్రతి వాక్యానికి ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే వచ్చే ఒకే ఒక్క సమాధానం లాక్‌డౌన్. కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో ప్రజల శ్రేయస్సు కోరి లాక్‌డౌన్ పెట్టారు నిజమే.. అలాగే వలస కూలీలను తమ స్వరాష్ట్రాలకు చేర్చడానికి శ్రామిక్ రైళ్లను కూడా పెట్టింది. కానీ వారు ఆ రైలును చేరుకోవడానికి నడిచే దూరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుండేదనిపిస్తోంది. దీన్ని నిర్లక్ష్యం అనాలో… దురదృష్టం అనాలో… తెలియని పరిస్థితి. ఏదేమైనా ఇలా జరగడానికి పరోక్షంగా లాక్‌డౌన్ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: corona, covid, lockdown, aurangabad, train incident, sleep, migrant workers, maharashtra

Advertisement

Next Story