వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 11 శాతం : కేర్ రేటింగ్స్!

by Harish |
India Gdp
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 11 శాతం నుంచి 11.2 శాతం పరిధిలో వృద్ధి సాధిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ వెల్లడించింది. ఆర్థికవ్యవస్థలో విస్తృతమైన రికవరీ నేపథ్యంలో ఈ వృద్ధి నమోదయ్యే అవకాశముందని అభిప్రాయపడింది. ఈ వృద్ధి సాధించడంలో పన్ను వసూళ్ల పురోగతి కీలకమని, ఒకవేళ పన్ను వసూళ్లు ప్రతికూలంగా నమోదైతే జీవీఏ (స్థూల అదనపు విలువ)పై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

‘రికవరీ ఇప్పటికే చాలా రంగాల్లో కనిపిస్తోంది. అయితే, సేవల రంగం ఇప్పటికీ పరిమితుల మధ్య కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు టీకా పంపిణీ కీలకంగా ఉండనుంది. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు దేశంలో టీకాలు వయసు సడలింపుతో అందించాల్సిన అవసరం ఉందని’ కేర్ రేటింగ్స్ అభిప్రాయపడింది. అలాగే, వ్యవసాయ రంగం వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతం ఉంటుందని, పారిశ్రామిక, సేవల రంగాలు 11.6 శాతం వృద్ధి నమోదు చేస్తాయని పేర్కొంది. సేవల రంగంలోని వాణిజ్యం, హోటళ్లు, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ తదితర విభాగాలు రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed