2021 చివర్లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌లకు డిమాండ్ : ఐడీసీ ఇండియా

by Harish |
2021 చివర్లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌లకు డిమాండ్ : ఐడీసీ ఇండియా
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్నేళ్ల పాటు సానుకూల వృద్ధిని సాధించిన భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్… 2020లో వార్షిక ప్రాతిపదికన 1.7 శాతం క్షీణించింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2020లో మొత్తం 15 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరిగాయని ఐడీసీ తెలిపింది. 2021లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరింత పటిష్ఠమవుతుందని ఐడీసీ అభిప్రాయపడింది. గతేడాది కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడం, రిమోట్ వర్క్, ప్రయాణంలో ఆంక్షలు, తయారీ కార్యకలాపాల నిలిచిపోవడం వంటి కారణాలతో జనవరి-జూన్ కాలంలో 26 శాతం క్షీణించాయి.

అనంతరం మార్కెట్లు క్రమంగా తిరిగి ప్రారంభం కావడంతో జులై-డిసెంబర్ కాలంలో 19 శాతం వృద్ధిని పరిశ్రమ సాధించగలిగింది. ‘2020 చివరి భాగంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పుంజుకోవడంతో స్మార్ట్‌ఫోన్ పరికరాల వినియోగంపై స్పష్టత వచ్చింది. 2021లో మార్కెట్ అధిక సింగిల్ డిజిట్ వార్షిక వృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మీడియం రేంజ్, 5జీ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోందని’ ఐడీసీ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ కేందర్ సింగ్ చెప్పారు. 2020 క్యాలెండర్ ఏడాది రెండో భాగంలో 5జీ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 30 లక్షలను దాటాయి. దేశీయంగా అధిక ధరలు, 5జీ నెట్‌వర్క్ లేకపోవడంతో స్థానిక అమ్మకాలు పరిమితం అయ్యాయి. అయితే, 2021 చివర్లో లేదంటే 2022 ప్రారంభంలో వీటి అమ్మకాలు పుంజుకుంటాయని ఐడీసీ ఇండియా భావిస్తొంది.

Advertisement

Next Story