- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోసాలకు, అన్యాయాలకు కేరాఫ్ చంద్రబాబు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మోసాలకు, అన్యాయాలకు కేరాఫ్ అడ్రస్ (Care Of Address) లా మారిపోయారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YCP Leader Jagan Mohan Reddy) విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కూటమి ప్రభుత్వం (NDA Government)పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. 15 పాయింట్లను ప్రస్తావిస్తూ సీఎంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు.. నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారని, ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారని ఆరోపించారు. అలాగే మూడు వారాలుగా గ్రూప్-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి, చివరకు వారిని నట్టేటా ముంచారని, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞాపనలను వింటున్నానని, తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు రెండు రోజులముందు విద్యాశాఖమంత్రి, మీ కుమారుడు మోసపూరిత ప్రకటన చేశారని చెప్పారు.
మరోవైపు తాను చెప్పినా సరే, ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న మీ వాయిస్‌తో ఆడియోను లీక్ చేస్తూ మరో డ్రామా చేశారని, ఇంకోవైపు ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులతో లాఠీఛార్జి చేయించి అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమేనని, ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణమని ఫైర్ అయ్యారు. మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం ఒక మోసమేనని, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి, అసలు దాని గురించి పట్టించుకోకపోవడం కూడా మీరు చేసిన మోసమేనని స్పష్టం చేశారు.
ఇక వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి, జీతం సంగతి దేవుడెరుగు చివరకు 2.6లక్షలమంది ఉద్యోగాలను ఊడగొట్టడమూ మోసమేనని, గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట, వీరిని వేరే డిపార్ట్‌మెంట్లకు సర్దుబాటు చేసి, అక్కడ ఖాళీలకు శాశ్వతంగా కోతపెట్టడమూ మోసమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ భృతి అని, నెలనెలా రూ.3,000 అని, ప్రతి ఇంటినీ మోసం చేయడం, ఇంకో మోసం అని, తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో 18వేలమందిని, ఫీల్డ్ అసిస్టెంట్లనూ, ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలోనూ పనిచేస్తున్నవారిని తొలగించి వారి జీవితాలను నడిరోడ్డుపై నిలబెట్టడము కూడా మీరు చేస్తున్న మోసాల్లో భాగమేనని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమేనని, ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అంటూ ఉన్న పీఆర్‌సీ ఛైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించి, కొత్త పీఆర్‌సీ ఇంతవరకూ వేయకపోవడమూ ఇంకో మోసమేనని చెప్పారు.
ఒకటో తేదీనే జీతాలు అంటూ, ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి, ఆతర్వాత ప్రతినెలా ఉద్యోగులు ఎదురుచూసేలా చేయడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమేనని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డీఏలు పెండింగ్‌లో పెట్టడం కూడా ఒక అన్యాయమేనని అన్నారు. ట్రావెల్ అలవెన్స్‌లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్.. అన్నీ పెండింగ్‌లో పెట్టడంకూడా ఇంకో అన్యాయమేనని, ఉద్యోగస్తులకు సంబంధించిన వారి జీఎల్‌ఐ, జీపీఎఫ్ కూడా మీ అవసరాలకు వాడేసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టించడం కూడా మీరు చేస్తున్న అన్యాయాల్లో భాగమేనని తేల్చి చెప్పారు. ఇక ఈ మోసాలకు, ఈ అన్యాయాలకు కేరాఫ్‌గా మారిన చంద్రబాబునాయుడు.. మీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారని, పోరాటాలు చేస్తున్నారని, ప్రజా పోరాటాలకు ఎప్పుడూ మా పార్టీ తోడుగా నిలుస్తుందని జగన్ రాసుకొచ్చారు.